సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) ను నియమించి, పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, వివిధ స్థాయిల్లోని ఎన్నికల అధికారులతో కలిసి ఎన్నికల ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్‌ను పక్కాగా అమలు చేయాలని, ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేయాలన్నారు.
నగదు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. దీంతో పాటు పోలింగ్‌కు ముందు 72 గంటలు, 48 గంటలు, 24 గంటలు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, ఎన్ఫోర్స్మెంట్, తదితర అంశాలపై అధికారులు, సిబ్బందికి వివరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో పాటు డీఆర్సీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తూ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు డాక్టర్ సరోజ్‌కుమార్, శ్రీవిద్య, అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్, శశాంక్ ఆనంద్, అమిత్ శుక్ల, సెంథిల్ కుమారన్‌తో పాటు నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులు పాల్గొన్నారు.