2K Run | బంజారాహిల్స్, నవంబర్ 14: తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 21న నెక్లెస్ రోడ్లో డ్రగ్స్ రహిత తెలంగాణ పేరుతో నిర్వహించనున్న 2కే రన్, మానవహారం కార్యక్రమాల పోస్టర్ను నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ ఆవిష్కరించారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కమాండ్ కంట్రోల్లో పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం కమిషనర్ సీవీ.ఆనంద్ మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు లోనై నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
తల్లిదండ్రులకు మానసిక వ్యథను మిగిల్చవద్దన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా పెట్టి డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా సమితి అధ్యక్షుడు పెండెం తారక్ గౌడ్, లయన్ అశోక్, సాయినాథ్ రెడ్డి, మంత్రి రాజు, చిరంజీవి, శ్యామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.