సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నగరంలో పోలీసు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను తీవ్రతరం చేశారు. పలుచోట్ల లెక్కకు రాని లక్షలాది రూపాయలు పట్టుపడుతున్నాయి. కాగా, శనివారం ఒక్కరోజే దాదాపు రూ. కోటి 23 లక్షలకు పైగా పోలీసులు పట్టుకున్నారు. అంతే కాకుండా 18 తులాల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హవాలా ద్వారా అక్రమంగా డబ్బులు తరలిస్తున్న ఒక వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, రాజస్థాన్ ప్రాంతానికి చెందిన సవాయి శర్మ(42) ఉపాధి కోసం కొన్ని వారాల క్రితం నగరానికి వచ్చి, రామ్‌కోఠిలో నివాసముంటున్నాడు. వృత్తి రీత్యా ట్రాన్స్పోర్ట్ నిర్వహించే శర్మ సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో హవాలా ఏజెంట్‌గా మారాడు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన మనీష్‌తో పరిచయం ఏర్పర్చుకుని అతడికి 0.5 నుంచి 0.8 శాతం కమీషన్‌తో డబ్బులు హవాలా మార్గంలో పంపిణీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మనీష్ సూచనల మేరకు బేగంబజార్, ఇతర మార్కెట్లలోని వ్యాపారులతో రూ.18 లక్షల వరకు కలెక్ట్ చేసిన శర్మ, శనివారం ఆ డబ్బును హవాలా ట్రాన్జాక్షన్ చేసేందుకు తన యాక్టివా వాహనంపై బేగంబజార్ పరిధిలోని సాయి ప్లైవుడ్ దగ్గరకు వచ్చాడు. అంతలోపు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, సరైన పత్రాలు లేకపోవడంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్దనున్న డబ్బును సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. నాలుగు రోజుల్లో వ్యవధిలో రూ.54 లక్షలకు పై చిలుకు నగదు, 18 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నర్సింహారెడ్డి తెలిపిన ప్రకారం, ఈ నెల 7వ తేదీన కిష్టాపూర్ క్రాస్‌లో వాహన తనిఖీలు చేపట్టగా కారులో వెళ్తున్న ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు ఎర్రగుట్ల మండలం చీలంకూర్కు చెందిన ఆదిరెడ్డి నర్సింహారెడ్డి వద్దనున్న బ్యాగులో రూ.13 లక్షల నగదు, వీవో ఫోన్ లభ్యమైంది. 11వ తేదీన మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో ఫతేనగర్‌కు చెందిన నాగేందర్ వద్ద రూ.35 లక్షలు నగదు లెక్క చూపని నగదు దొరికింది. 12వ తేదీన బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి వద్ద రూ.60 వేలు నగదు, 13వ తేదీన డబిల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద మరో వ్యక్తి వద్ద నుంచి రూ.62,900లు, అదే రోజున మేడ్చల్ పట్టణంలో మార్కెట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద నుంచి ర.5.68 లక్షలు, 18 తులాల బంగారం లభించింది. మొత్తంగా రూ.54,90,900 నగదు లభించింది. ఈ డబ్బులను సీజ్ చేసి, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రవేశపెడుతామని సీఐ తెలిపారు.
హిమాయత్‌నగర్: ఎన్నికల నేపథ్యంలో నారాయణ గూడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మైలార్ దేవరపల్లిలోని ఓ కంపెనీ లో మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అతీక్ అహ్మద్, బంజారాహిల్స్‌కు చెందిన కాజిల్ మాలిక్‌లు కార్మికులుగా పనిచేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కంపెనీకి సంబంధించిన డబ్బులను వసూలు చేసుకుని యాజమాన్యానికి ఇచ్చేందుకు హోండా యాక్టివాపై వెళ్లుతున్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ బ్యాంక్ సమీపంలో నారాయణగూడ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రూ.49 లక్షల 97వేల నగదు లభించింది. డబ్బులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపక పోవడంతో రూ.49 లక్షల 97వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.