Home Guard | ఖైరతాబాద్, ఏప్రిల్ 3: గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ హోంగార్డు డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం…. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ప్రతాపసింగారం ప్లాన్ నం. 14లో నివాసం ఉండె గొడిసెల సునీల్ గౌడ్ ప్రైవేట్ ఉద్యోగి. 2012లో ఓ స్నేహితుడి ద్వారా హోంగార్డు డి. చంద్రప్రకాశ్ పరిచయమయ్యాడు. గతేడాది సునీల్ గౌడ్ భార్య ధరావత్ భార్గవి ఉద్యోగం విషయం ప్రస్తావనకు రాగా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష రాసిందని, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
ఆమెకు రిజర్వేషన్ కోటలో గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పెట్టిస్తానని, అవసరమైతే డీఎస్పీతో మాట్లాడుతానని నమ్మించాడు. ఆమె చదువులకు సంబంధించిన జీరాక్స్ కాపీలు సైతం తీసుకున్నాడు. ఉద్యోగం కోసం రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పగా తొలివిడతగా రూ.3లక్షలు చెల్లించాడు. అంతేకాకుండా ఓ బ్లాంక్ చెక్కు సైతం తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా సదరు హోంగార్డు నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా, డబ్బులను తిరిగి అడిగితే ఇవ్వలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.