హిమాయత్‌నగర్,ఏప్రిల్7: జల్సాలకు అలవాటు పడి ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం నారాయణగూడలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ సైదేశ్వర్, డీఐ అభిలాష్, అడ్మిన్ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్సై నాగరాజు కేసు వివరాలను వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ కోల్‌కతాకు చెందిన హఫీజుల్ షేక్ (37) చీరలకు డిజైనింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొంతకాలం నుంచి అతను జల్సాలకు అలవాటు పడటంతో వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు. దీంతో దొంగతనాలు చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో డబ్బులు అవసరం ఉన్నప్పుడు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చి పగటి పూట తాళాలు వేసిన ఇండ్లను రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడేవాడు. దొంగిలించిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఢిల్లీ, కోల్కత్తా, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన అతని వక్ర బుద్దిని మార్చుకోకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.
ఇటీవల హిమాయత్ నగర్ వీధి నెం.15లో నివాసం ఉండే మహవీన్ ఫాతిమా ఇంట్లో నుంచి 37 గ్రాముల బంగారం, రూ.1.65లక్షలు, అదే ప్రాంతంలోని వీధి నెం.10లోని యోగేంద్ర ఇంట్లో నుండి 5 గ్రాముల బంగారం, రూ.35వేల నగదును దొంగిలించి పారిపోయాడు. బాధితులు వేర్వేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని, సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించి పాత నేరస్తుడు హఫీజుల్ షేక్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో హఫీజుల్ షేక్ కన్పించడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇదే తరహాలో నారాయణగూడలో రెండు, కూకట్‌పల్లిలో మూడు, సనత్‌నగర్ పీఎస్ పరిధిలో ఒకటి, మొత్తం ఆరు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. అరెస్ట్ చేసిన హఫీజుల్ షేక్‌ను రిమాండ్‌కు తరలించారు. డీఎస్సై నాగరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు.