ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు వివరిస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు తదితరులను సాట్స్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని ఎండగడుతూ, రేవంత్ – బాబు కుట్రలపై విద్యార్థి లోకాన్ని చైతన్య పరుస్తున్న విద్యార్థి నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బనకచర్ల ద్వారా భవిష్యత్లో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్లకు పచ్చ జెండా ఊపిన బీజేపీ బండారం బట్టబయలు చేద్దామని పిలుపునిచ్చారు. గోదావరి నదిలోని తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
కాంగ్రెస్ – టీడీపీ- బీజేపీల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ధ్వజమెత్తారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని దుయ్యబట్టారు. త్వరలోనే ప్రజల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదన్నారు.