సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే టపాసుల విక్రయ దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్ పొందాలనుకునే వారు టీఎస్పోలీస్.జీవోవి.ఇన్, ఈసర్వీసెస్.టీఎస్పోలీస్.జీవోవి.ఇన్ ద్వారా ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్ తెలిపారు. ఈ లైసెన్స్ ఆయా జోన్ల డీసీపీల ఆధ్వర్యంలో జారీ చేస్తారని వివరించారు. దరఖాస్తు ఫారంతో పాటు డివిజనల్ ఫైర్ అఫీసర్ నుంచి ఎన్ఓసీ, ప్రభుత్వ స్థలమైతే అందుకు సంబంధిత అధికారులు ఇచ్చిన అనుమతి లేఖ, ప్రైవేట్ స్థలమైతే స్థల యజమానుల నుంచి అనుమతి పత్రం, గత ఏడాది జారీ చేసిన పాత లైసెన్స్ కాపీ ఉంటే ఒక కాపీ(ఆప్షనల్), భవనాల్లో ప్రత్యేకంగా ఒక్కటే ఏర్పాటు చేస్తే ఇరుగు పొరుగు వారి నుంచి ఎన్ఓసీ, ఏర్పాటు చేసే దుకాణానికి సంబంధించిన సైట్ ప్లాన్ (బ్లూ ప్రింట్ కాపీ)ని కూడా జత చేయాలన్నారు. ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు, లైసెన్స్ ఫీజుకు రూ. 600 పోలీసుల ప్రధాన ఖాతాల్లో ఈ కింది తెలిపిన బ్యాంకుల్లో చెల్లించాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే ఎస్బీఐ, గన్‌పౌండ్రీ శాఖ, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అయితే మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కీసర శాఖలో చెల్లించాలన్నారు.