చిక్కడపల్లి,డిసెంబర్26 : ఇందిరాపార్క్ సమీపంలోని కళా భారతి ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 8వ రోజు సందర్శకులతో సందడి నెలకొంది. గురువారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బుక్ ఫెయిర్‌ను సందర్శించారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే బుక్ ఫెయిర్ అన్ని రకాల పుస్తకాల కూడలి లాంటిందన్నారు. విద్యార్థులు, యువకులు, ప్రతి ఒక్కరూ బుక్ ఫెయిర్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, ఆర్.వాసు, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, కోశాధికారి నారాయణ రెడ్డి, బొమ్మగాని కిరణ్, ప్రముఖ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాలు ప్రస్థానం కార్యక్రమంలో ‘వికీపీడియా గురించి మీకు తెలుసా’ అనే ఉచిత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వికీపీడియాల్లో ఎక్కువ వ్యాసాలను కలిగిఉన్న జాబితాలోకి చేరడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, వికీపీడియన్లు కృపాల్ కశ్యప్, వి.జె.సుశీల, గుంటుపల్లి రమేశం, ప్రణక్ష్మి రాజ్ వంగరి, నాగరాణి బేతి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రచించిన ‘శ్రీ శూద్రగంగ’ వచన రూప కావ్యం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్ వినోదిని మాదాసు అధ్యక్షత వహించిన ఈ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, లోకకవి అందే శ్రీ, ప్రముఖ సినీ నటుడు,రచయిత ఉత్తేజ్, ప్రముఖ రచయిత భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి, విమర్శకుడు బెల్లి యాదయ్య, ప్రముఖ కవి, కోయ కోటేశ్వర రావు, అంతర్జాతీయ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, బంగారు బహ్మం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న కళాపీఠం ముద్రించిన మహాకవి దాశరథి శతజయంతి సందర్భంగా దాశరథి పై రాసిన ‘మహాకవి దాశరథి’ పుస్తక పరిచయ సభను బుక్ ఫెయిర్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి,రచయిత నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడారు. నిజాం కాలంలో దాశరథి పోరాట ఘట్టాలను వివరించారు. జైలు గోడలపై ఆయన రాసిన కవిత్వాలు ఎంతో శక్తివంతమైనవన్నారు.
ఆ కవిత్వాలతో వట్టికోట అళ్వారు స్వామి, దాశరథి మధ్య ఉండే ఉద్యమ మైత్రీని వివరించారు. రామకృష్ణ చంద్రమౌళి సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు డాక్టర్ యాకూబ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్.ఎన్.బాలాచారి,గంటా మనోహర్ రెడ్డి, నాగయ్య, కళాపీఠం చైర్పర్సన్ సరోజినీ దేవి, గోల్కొండ సాహితీ కళా సమితి అధ్యక్షుడు చంద్ర ప్రకాశ్ రెడ్డి, రాధా కుసుమ తదితరులు పాల్గొన్నారు.