ఖైరతాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్ మా ప్లాట్లను అప్పనంగా ప్రైవేట్ బిల్డర్స్‌కు కట్టబెట్టారని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం అసోసియేషన్ ప్రతినిధులు హరి ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, రాంభూపాల్, నర్సింహారెడ్డి మాట్లాడారు. తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 108, 109, 110, 111లో సుమారు 70.39 ఎకరాల భూమి ఉందని, ఆ వెంచర్లో 1980 నుంచి 2005 సంవత్సరాల మధ్య సుమారు 800 మంది ప్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
అందుకు సంబంధించిన అన్ని పన్నులు ప్రభుత్వానికి కడుతున్నారన్నారు. 2005లో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఈ స్థలం తమది కాదంటూ వాదించారని, దీంతో కోర్టును ఆశ్రయించగా, 2009లో తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, అంతేకాకుండా 2012లో చట్టబద్ధత కోసం తహసీల్దార్ వద్ద ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేశామని, ప్రస్తుతం ఆ కేసు నడుస్తున్నదన్నారు. 2020లో అమోయ్ కుమార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిగణంలోకి తీసుకోకుండా, రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉన్న కేసును పట్టించుకోకుండా ఆమోద బిల్డర్స్‌కు కట్టబెట్టారన్నారు.