సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల తరలింపు ఇంకా సందిగ్ధం వీడలేదు. తార్నాక, అమీర్‌పేట్, నానక్‌రాంగూడ, లుంబినీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లోకి మార్చుతామంటూ రెండు నెలల కిందటే కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ప్రభుత్వం కూడా జీవోతో ఆదేశాలు జారీ చేసింది. అప్పటికప్పుడు అధికారులు కూడా పైగా ప్యాలెస్‌లో మార్పులు, చేర్పులతో పనులు చేపట్టారు. అయితే నెలలు గడుస్తున్నా పైగా ప్యాలెస్ తరలింపులో పనులు మందగించాయి.
అదే సమయంలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, ఆగస్టులోనే పైగా ప్యాలెస్ నుంచి హెచ్ఎండీఏ కార్యకలాపాలు నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. కానీ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి వెళ్లిపోవడంతో తరలింపు ప్రణాళికలు అటకెక్కించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట్‌లోని ‘పైగా ప్యాలెస్’ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు సర్కారు ప్రయత్నం చేసింది.
అందుకు హడావిడిగా తరలింపు ప్రణాళికలు, జీవోలను విడుదల చేసి ‘పైగా ప్యాలెస్’లో సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన సమయంలో హెచ్ఎండీఏ ఇన్చార్జి బాధ్యతలను ఐఏఎస్ ఆమ్రపాలి నిర్వర్తిస్తుండగా… తరలింపు పనులపై అధికారులతో సమీక్షించారు. కానీ తాజాగా ఆమె స్థానంలో పూర్తిస్థాయి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ రావడంతో తరలింపు పనులు పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయానికి అవసరమైన పనులను సగానికి పైగా పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు.. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో పనులను చేపట్టేందుకు ఆసక్తి చూపడంలేదు.
సుమారు లక్ష చదరపు అడుగులకు పైగా ఉన్న విస్తీర్ణంలో హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ‘పైగా ప్యాలెస్’లో సిద్ధం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా ఇంజినీరింగ్ విభాగం ప్యాలెస్‌లో ఉన్న మౌలిక వసతులు, ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల పరిశీలన తర్వాత పనులు చేపట్టింది. మౌలిక వసతులు, విద్యుత్, ఐటీ, నెట్ వర్కింగ్ వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గతంలోనూ తార్నాకలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని అమీర్‌పేట్ స్వర్ణజయంతికి తరలించే క్రమంలోనూ ఇదే తీరుగా తర్జనభర్జనలతో సాగిన ప్రక్రియ ఏడాది తర్వాత అమీర్‌పేట్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. కానీ ఇక్కడ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఇతర కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండటంతోపాటు మూడు ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండీఏ విభాగాలతో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.
ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పక్కా భవనం లేదు. తార్నాకలో ఉన్నప్పుడు కూడా చాలీచాలని గదుల్లోనూ అధికారులు విధులు నిర్వర్తించారు. స్వర్ణజయంతికి వచ్చిన తర్వాత కొన్ని విభాగాలు నానక్‌రాంగూడకు తరలించడం, మరికొన్ని విధులను బీపీపీ నుంచి నిర్వర్తించడంతో ఉన్నతాధికారుల సమీక్షలు, సమావేశాల సందర్భంలో కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోయేది.
స్వర్ణజయంతి కార్యాలయంలోకి మార్చిన సంస్థకు ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో అద్దెలను కోల్పోవడంతోపాటు ఇతర కోచింగ్ సెంటర్లు, ఐటీ సంస్థలతో కార్యాలయం ఎప్పుడూ రద్దీగానే ఉంది. దీంతో విశాలమైన గదులతో పునరుద్ధరించినప్పటికీ ఒకేచోట హెచ్ఎండీఏ విభాగాలను ఏర్పాటు చేసుకునేంత చోటులేదు. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ కార్యాలయానికి పూర్తిస్థాయి భవనంగా ‘పైగా ప్యాలెస్’ను చేసుకోవాలని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కానీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అసలు ఇప్పట్లో తరలింపు ప్రక్రియ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడింది.