నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, ప్రధాన నిందితుడు నమిత్‌శర్మలకు ఊరట లభించింది. ఐదోసారి కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు కొట్టివేసింది. వరుసగా నాలుగుసార్లు 10రోజులపాటు అధికారులు శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సుదీర్ఘ విచారణ చేపట్టారని నిందితుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనల్ని కోర్టు ఏకీభవించింది.
ఈ నెల 20కి విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ సమయంలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లిన అధికారులపై నమిత్‌శర్మ కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. నేరాంగీకార పత్రంలో కీలక విషయాలను అధికారులు కోర్టుకు సమర్పించడంతో 12వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పూర్తిస్థాయి విచారణ చేపట్టి కస్టడీ పిటీషన్‌ను తిరస్కరించింది. సదరు కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను కొట్టివేయడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జడ్జి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు రిమాండ్ ఖైదీలుగా చంచల్గూడా జైలులో ఉన్నారు.