ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : దేశంలో ఏ ప్రభుత్వం కూడా దళితుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, దళిత బంధుతో సీఎం కేసీఆర్ వారి హృదయాల్లో ఆత్మబంధువుగా నిలిచారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. గురువారం సాయంత్రం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో నిర్వహించిన తెలంగాణ దళిత కుల, ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో కొత్త కాంతులు నింపుతున్న ‘దళిత బంధు’ పథకాన్ని స్వాగతిస్తున్నామని, ఆ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితుల పక్షాన అక్టోబర్ 5న ఇందిరాపార్క్‌లో వేలాది మంది దళితులతో ‘దళిత కృతజ్ఞత సభ’ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు, ఇప్పటి వరకు దళితులకు ఏం చేశారో చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో, వాసాలమర్రిలో దళితులందరికీ దళిత బంధు అందించారని తెలిపారు. దళిత కృతజ్ఞత సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దళిత బంధువులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఎంహెచ్పీఎస్ అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కె.ధీరన్, టీఎంఎస్‌ఎస్ అధ్యక్షుడు గడ్డ యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ రావు, టీడీడీ అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు, బీఎస్ఎఫ్ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్, దేవరకొండ నరేశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.