మేడ్చల్, నవంబర్ 30 : హానికరమైన మెఫోడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులతో కలిసి టీజీ న్యాబ్ (యాంటీ నార్కోటిక్ బ్యూరో) పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శనివారం వెల్లడించారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అల్లూ సత్యనారాయణ(43) కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఉన్న రుద్ర టెక్నాలజీలో పని చేస్తున్నాడు. అతడు ఏడేళ్ల నుంచి మెఫెడ్రోన్, ఎపిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నాడు. ఈ డ్రగ్ తయారీకి యాదిరిగుట్టలో మూతపడిన యాదాద్రి లైఫ్ సైన్సెస్ కంపెనీని వినియోగించుకుంటున్నాడు. డ్రగ్‌ను తయారు చేసిన తర్వాత కంపెనీ యజమాని వాసుదేవ చారి, అతడి స్నేహితుడు అయిన కృష్ణారెడ్డికి విక్రయిస్తున్నాడు. వారికి విక్రయించడంతో పాటు సత్యనారాయణ కూడా సొంతంగా మాదకద్రవ్యాల వినియోగదారులకు ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ టీజీ న్యాబ్ అధికారులు, మేడ్చల్ పోలీసులతో కలిసి శుక్రవారం మేడ్చల్ పారిశ్రామిక వాడ వద్ద నిఘా పెట్టారు.
మేడ్చల్ చెక్‌పోస్టు మీదుగా మెఫాడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తుండగా సత్యనారాయణను పట్టుకున్నారు. అతడి నుంచి కిలో మెఫాడ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా కృష్ణారెడ్డి, వాసుదేవ చారి, మహ్మద్ ఇస్మాయిల్, మచ్చ భానుప్రసాద్, చీపిరి సునీల్, ఫైజాన్ అహ్మద్, వాసుదేవ చారి, మసూద్ డ్రగ్ తయారీ, విక్రయంలో బాధ్యులుగా ఉన్నట్టు వెల్లడైంది. వారంతా పరారీలో ఉన్నారని, త్వరలో వారిని పట్టుకుంటామని డీసీపీ కోటిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ రూ.50 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.