సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న ఒక మాజీ సైనిక ఉద్యోగిని సికింద్రాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.లక్షల విలువైన మధ్యప్రదేశ్‌కు చెందిన 51డిఫెన్స్ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే….సికింద్రాబాద్‌కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి కె. విద్యాసాగర్ రెడ్డి గత కొన్ని రోజులుగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బుధవారం పక్కా ప్రణాళికతో సికింద్రాబాద్‌లోని సె్టైల్ యేనియన్ షాపింగ్‌మాల్ సమీపంలో డిఫెన్స్ మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న మాజీ సైనిక ఉద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అతడి వద్ద నుంచి 11మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడి ఇంటిపై దాడులు జరిపి తనిఖీ చేయగా మరో 40 డిఫెన్స్ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి మొత్తం రూ.లక్ష విలువైన 51 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్లలో 28 టీచర్స్, 18 సీగ్రమ్ సాచ్ బాటిళ్లు, మూడు సిగ్నేచర్, వైన్ బాటిళ్లు ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎస్. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చింతల్‌లోని భగత్‌సింగ్ నగర్లో జకుల సాకేత్ అనే వ్యక్తి నిషేదిత దగ్గు మందు సీసాలను అమ్ముతుండగా పట్టుకున్నారు. ఈ నిషేదిత దగ్గు మందు బాటిళ్లు ఎకడి నుంచి వచ్చాయని నిందితుడిని ప్రశ్నించగా తులసి మెడికల్ షాపు యజమాని గుండ్ల చంద్రశేఖర్ ఇచ్చాడని తెలిపాడు. నిందితుడి సమాచారంతో గుండ్ల చంద్రశేఖర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 10 నిషేధిత దగ్గు మందు బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 15 నిషేధిత దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కుత్భుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.