సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): పార్టీలు చేసుకుంటున్నారా.. అయితే మీపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిఘా ఉంటుంది. హోటల్స్, ఫామ్ హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్ ఇలా ఎక్కడ దావత్‌లు చేసుకున్నా మీ వద్దకు ఎక్సైజ్ శాఖ వచ్చి వాలుతుంది.
ఆరు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువగా తాగేశారంటే మీరు కేసులో ఇరుక్కోవాల్సిందే. ఏదైనా ఒక ప్రాంగణాన్ని అద్దెకు తీసుకొని అక్కడ పార్టీ చేసుకుంటున్నారంటే తప్పని సరిగా ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. డబ్బులు పెట్టి మందుకొని, ఆ మందు తాగడానికి పర్మిషన్ తీసుకోవడమేమిటంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి ఆరు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ కల్గి ఉండకూడదనే నిబంధన ఉంది, దానిని అవసరాన్ని బట్టి అమలు చేస్తుంటారు. ఇండ్లలో జరిగే పార్టీలను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఫామ్‌హౌస్‌లే టార్గెట్ …
జీహెచ్ఎంసీ ప్రాంతంలో సాధారణ మద్యం పార్టీకి రూ. 12 వేలతో అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ఆ పార్టీలో 500 మంది హాజరవుతున్నారంటే దానికి రూ. 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీయేతర ప్రాంతాల్లో రూ. 9 వేలు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం విక్రయాలు ఎక్కువ చేసి ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తుంది. శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌లను టార్గెట్ చేసుకుంటూ అందినకాడికి జరిమానాలు వసూలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు.
ఇటీవల శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్ కల్చర్ పెరుగుతుంది. దీంతో బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు సమావేశాలు, గెట్ టు గెదర్ పార్టీలు చేసుకోవాలంటే ఒక చిన్న ఫామ్ హౌస్‌ను తీసుకుంటున్నారు. రూ. 5 వేలు పెట్టి ఫామ్‌హౌస్ కిరాయి తీసుకుంటే అందుకు డబుల్ వెచ్చించి లిక్కర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరముంటుంది. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చిన్న అవకాశాలను వదిలేయడం లేదు. ఒక పక్క రోజు రోజుకు పెరుగుతున్న బెల్ట్ దుకాణాలు, మరో పక్క లిక్కర్ అనుమతులంటూ ఎక్సైజ్ శాఖ ప్రజలను పీడిస్తుందని విమర్శలున్నాయి. లైసెన్స్ అనుమతి కోసం https://excise.telangana. gov.in/లో సంప్రదించాలని ఎక్సైజ్ శాఖ అదికారులు సూచిస్తున్నారు.