కుత్బుల్లాపూర్,డిసెంబర్31: స్వీయ క్రమశిక్షణతో నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని సమర్థవంతంగా విధి నిర్వహణలో ముందుకు వెళ్లాలని తెలంగాణ అటవీ అదనపు ప్రధాన సంరక్షణాధికారి, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డా.పివి రాజారావు అన్నారు. శనివారం దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో ఐదవ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారుల మూడు నెలల శిక్షణ ముగింపు సందర్భంగా స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ట్రైనీ అధికారుల పరేడ్ అనంతరం ఉత్తీర్ణత పత్రాలను, ఉత్తమ ఫలితాలను సాధించిన వారికి బంగారు పతకాలను డైరెక్టర్ పివి రాజారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారులు జి.రవీందర్, జి.నర్సయ్య, అటవీ అకాడమీ అదనపు డైరెక్టర్ ఎస్.రమేశ్, డిప్యూటీ డైరెక్టర్లు సీహెచ్.రంగారెడ్డి, వి.ఆంజనేయులు, వి.రామమోహన్, ఎస్ఎ నాగినిభాను, ఎన్ఆర్ సంగీత, తదితరులు పాల్గొన్నారు.