అబిడ్స్, సెప్టెంబర్ 29 : వినాయక నిమజ్జనం సందర్బంగా రహదారులపై పేరుకు పోయిన చెత్తను సకాలంలో ఎత్తి వేసేందుకు గాను జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి మొదలుకుని బషీర్‌బాగ్ చౌరస్తా వరకు ప్రసాదాల పంపిణీ, తాగునీటి సరఫరా చేసేందుకు వేదికలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రసాదంపంపిణీ చేశారు. వినాయక మండపాలకు స్వాగతం పలికేందుకు గాను ఏర్పాటు చేసిన స్వాగత వేదికల ద్వారా పుష్పాలు చల్లడంతో రహదారుల నిండా గ్లాసులు, ప్లేట్లు, పుష్పాలు, చెత్తా చెదారం నిండింది. వర్షం కురిసి ఎండి పోవడంతో బురదమయంగా మారింది. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, స్వీపర్లు శుక్రవారం తెల్లవారు జాము నుంచి రహదారులను ఊడ్చడం, పేరుకు పోయిన చెత్తను ఎత్తి వేయడం, మండపాల వద్ద పూజా సామగ్రి వంటి వాటిని ఎత్తి వేసేందుకు గాను శ్రమ పడాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ కార్యాలయం డీసీ బాలయ్య, ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తమ సిబ్బందితో తెల్లవారు జాము నుంచి రోడ్లను ఊడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. సర్కిల్ పరిధిలోని ఉస్మాన్‌గంజ్ నుంచి మొదలుకుని ట్యాంక్‌బండ్ వరకు ఈ రహదారులను ఊడ్చే కార్యక్రమం కొనసాగింది. శుక్రవారం ఉదయం వరకు వాహనదారుల రాక పోకలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు సిబ్బంది శ్రమించారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ప్రతి నిత్యం 300 టన్నుల చెత్తను ఎత్తి వేయిస్తారు. నిమజ్జనం సందర్భంగా అదనంగా పేరుకు పోయిన మరో 120 మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తి వేయించినట్లు ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
వినాయక నిమజ్జనం ప్రధాన రహదారిలో చెత్తను ఎత్తి వేయడంతో పాటు రహదారులు శుభ్రంగా ఉండేందుకు గాను స్వీపింగ్ యంత్రాల ద్వారా రహదారులను శుభ్రం చేశారు. శానిటేషన్ సిబ్బంది రోడ్లన్నింటినీ శుభ్రంగా ఊడ్చి చెత్తను ఎత్తి వేశారు. దీంతో నిమజ్జన మార్గంలోని ప్రాంతాలు శుభ్రంగా కనిపించాయి ట్రాఫిక్ పెరిగి పోవడంతో చిన్న వీధుల్లో మిగిలి పోయిన చెత్తను పూర్తి చేసేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సకాలంలో ఎత్తి వేసి శానిటేషన్ సిబ్బంది శభాష్ అనిపించుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా రహదారులపై పేరుకు పోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు సిబ్బంది శుక్రవారం తెల్లవారు జాము నుంచి పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ఉదయం వరకు వాహనాలు రహదారులపై సజావుగా సాగేలా చర్యలు తీసుకునేందుకు వారు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.