అబిడ్స్, నవంబర్ 17: గోషామహల్ చాక్నావాడిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి తవ్వకాలు చేస్తుండగా పక్కన ఉన్న భవనం కుంగి పోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాక్నావాడి నాలా సమీపంలో 80 గజాల స్థలంలో ఓ వ్యక్తి పిల్లర్ల నిర్మాణానికి జేసీబీతో తవ్వకాలు చేస్తుండగా అకస్మాత్తుగా పక్కనే ఉన్న భవనం నేలకు ఒరిగింది. ఇంట్లో నివాసం ఉండే వారు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న గోషామహల్ ఎస్ఐ లక్ష్మయ్య, హైడ్రా, జీహెచ్ఎంసీ సెక్షన్ అధికారి మహేందర్తో పాటు పలు శాఖల అధికారులకు సమస్యను వివరించడంతో ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు.
నిర్మాణం చేపట్టేందుకు ఖాళీ స్థలంలో ఇరువైపులా ఉన్న రెండు భవనాల మధ్య ఐరన్ రాడ్లను ఏర్పాటు చేశారు. ఒరిగిన భవనం వైపు మట్టి, కంకర, ఇసుక వేసే పనిలో నిమగ్నమయ్యారు. చాక్నావాడి నాలా రోడ్డును పోలీసులు మూసి వేశారు. అంతే కాకుండా చాక్నావాడి నాలా రెండు సంవత్సరాల్లో మూసి వేశారు. అంతే కాకుండా చాక్నావాడి నాలా రెండు సంవత్సరాల్లో నాలుగు పర్యాయాలు పై కప్పులు నేలమట్టం కావడంతో ఇటీవలనే కొత్త పై కప్పు నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతం అంటేనే ఎప్పుడు భయంగా ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఇంటి నిర్మాణం తవ్వకాలు చేపడుతున్న యజమానితో పాటు బిల్డర్ సైతం అక్కడి నుంచి కొద్ది క్షణాల్లో జారుకున్నారు. దీంతో పలు శాఖల అధికారులు స్వయంగా పరిసర ప్రాంతాల భవనాలకు ఐరన్ రాడ్స్ బిగించే పని చేపట్టారు.