పెద్దఅంబర్‌పేట, జూన్ 14 : డంపింగ్ యార్డు మాకొద్దు.. గో బ్యాక్, గో బ్యాక్ డంపింగ్ యార్డు గో బ్యాక్.. అనే నినాదాలతో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని సద్దుపల్లి చౌరస్తా దద్దరిల్లింది. బండరావిరాలలో డంపింగ్ యార్డు వద్దని, జీవో 20ని రద్దు చేయాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆదివారం గువ్వలేటి చౌరస్తా నుంచి చేపట్టిన పాదయాత్ర చిన్నరావిరాల, బండరావిరాల మీదుగా సద్దుపల్లి చౌరస్తా వరకు నిర్వహించారు. చౌరస్తాలో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.
డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డుతో జీవితాలే నాశనమవుతాయని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పాటలతో నిరసించారు. కార్యక్రమంలో బండరావిరాల, చిన్నరావిరాల, పిలాయిపల్లి, దేశ్‌ముఖ్, జగత్పల్లి, పెద్దగూడెం, కవాడిపల్లి సర్పంచ్‌లు విజయ్‌కుమార్, బాలకిషన్‌గౌడ్, మహాలక్ష్మి, జంగయ్యయాదవ్, మహేశ్, నర్సిరెడ్డి, లక్ష్మీప్రసన్న, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.