హయత్‌నగర్, డిసెంబర్ 24 : ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాళీగా ఉన్న ప్లాట్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్, గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన ముడావత్ దీప్లా నాయక్, నందనవనంకు చెందిన కేతావత్ పూల్‌సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మాచగోని రంగయ్య, బిరాదర్ మారుతీ, స్వామి నాయక్, రమేశ్ నాయక్, మరికొంతమంది కలిసి కొంతకాలంగా ఎటువంటి రిజ్రిస్టేషన్లు జరగని ప్లాట్లను గుర్తించి వాటి సీసీ కాపీల ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేసి అమాయకులకు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు.
వాటిల్లో భాగంగా పెద్దఅంబర్‌పేట సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం నందు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గండిచెరువు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.183, 186, 187, 188, 189లలో చాలా కాలంగా రిజిస్ట్రేషన్ జరగని ప్లాట్లను గుర్తించి వాటికి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి ఫైనాన్స్ వారికి విక్రయించారు. దీన్ని గమనించిన సదరు ప్లాటు యజమాని వాణి, భర్త శ్యామ్ ప్రసాద్‌ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. ప్రధాన నిందితులైన ముడావత్ దీప్లానాయక్, కేతావత్ పూల్‌సింగ్, రంగయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు.