సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : వర్షాకాల సమస్యలపై ప్రజలు తిరుగుబావుటా ఎగురవేశారు.. ముఖ్యంగా నాలా సమస్యపై ఇంతకాలం ట్విట్టర్, జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ వేదికగా గళం విప్పిన స్థానికులు.. వరద ముంపును పర్యటించేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో వరద ముంపుతో నానా ఇబ్బందులు పడితే.. ఎస్ఎన్డీపీ (నాలా అభివృద్ధి) పనులను త్వరగా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపుతామంటూ చెప్పి వెళ్లిపోయి.. మళ్లీ ఏడాది తర్వాత సమస్యను పరిష్కారిస్తామంటూ ముందుకు వస్తున్న నేతలపై ఆగ్రహంతో ఉన్నారు.. ఎస్ఎన్డీపీ మొదటి దశ పనులను ఏడాది కిందటే పూర్తి చేయాల్సిన చోట ఏండ్ల తరబడి పనులు జరుపుతున్న అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధులకు ప్రజాకోర్టులో భంగపాటు తప్పడం లేదు. ఇందులో భాగంగానే శుక్రవారం యాకత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మౌలక చిల్లా ప్రాంతంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. కొద్ది రోజులు మా బస్తీల్లో గడిపితే నరకం ఏంటో మీకే తెలుస్తుందంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రెండు రోజులుగా వస్తున్న వరదతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేను ఘోరావ్ చేశారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం ఎమ్మెల్యే చేయగా, అంతలోనే ఆయన అనుచరులు స్థానికులపై తిరగబడి దాడి చేశారు. ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా నిలబడి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వర్షాకాల సమస్యల నియంత్రణలో ప్రభుత్వం విఫలం చెందిందని మండిపడ్డారు.
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులపై ప్రజాపాలన ప్రభుత్వం శీతకన్ను వేసింది. గడిచిన 17 నెలలుగా పురోగతిలో ఉన్న ఎస్ఎన్డీపీ మొదటి దశ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యపు ధోరణిని అవలంభిస్తున్నది. పురోగతిలో ఉన్న 10 చోట్ల పనులను పూర్తి చేయలేక చేతులేత్తేసింది. ఫలితంగా నేటికీ ఎస్ఎన్డీపీ పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని , పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. పనులను చకచకా పూర్తి చేసేందుకు అనుకూలమైన ఈ వేసవిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిన దరిమిలా మళ్లీ అదే వరద, ఆదే సమస్య అన్నట్లుగా స్థానికుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబరు మాసంలో వరుణుడి బీభత్సం తర్వాత వరద నీటికి శాశ్వత చర్యలు చేపట్టాలని భావించిన ఎస్ఎన్డీపీ తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు చేపట్టింది. పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.531కోట్లతో 29 ప్రాంతాలలో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. తద్వారా 150 కాలనీలను వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది. 43 కిలోమీటర్ల పనుల పూర్తితో ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. కానీ ఘనత వహించిన ఎస్ఎన్డీపీ పనుల పురోగతిని పట్టించుకోవడం లేదు..ఇందుకు క్షేత్రస్థాయి పనులే అద్దం పడుతున్నాయి.
నాలా అభివృద్ధి పనుల రెండో దశలో 57.401 కిలోమీటర్లలో రూ.667.28 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎస్ఏఎస్సీఐ (స్పెషల్ అసిస్టెంట్స్, స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీం) పథకం కింద రూ.250 కోట్లు మాత్రమే విడుదల చేయగా, మిగిలిన నిధులపై స్పష్టత లేదు. నిధుల విడుదల జాప్యం కారణంగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి.