మేడ్చల్, అక్టోబర్12, (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా ఆదాయం పెంచుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారితోపాటు ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరించుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో పీర్జాదిగూడ, బొడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్లు కార్పొరేషన్లు కాగా మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, తూకుంట, నాగారం, పోచారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, కొంపల్లి, దుండిగల్, ఎల్లంపేట్, అలీయాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలుగా ఉన్నాయి.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 18,201 వ్యాపార వాణిజ్య సంస్థలు క్షేత్రస్థాయిలో 8,046 వ్యాపార సముదాయాలకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. మిగతా వ్యాపార సముదాయలు వ్యాపారం ప్రారంభించినప్పుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని, ఆ తర్వాత రెన్యూవల్ చేయలేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వాణిజ్య సముదాయాలు నిర్వహిస్తున్న వారంతా తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంది. ఇలా ట్రేడ్ లైసెన్స్ ద్వారా కూడా మున్సిపాలిటీలకు ఆదాయం లభిస్తుంది. దీంతో వ్యాపారులంతా లైసెన్స్ తీసుకునేలా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
రెన్యూవల్ చేయకుంటే జరిమానాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోకుంటే జరిమానా విధించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆస్తిపన్ను మాదిరిగానే ప్రతి ఏటా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా ట్రేడ్ లైసెన్స్‌లకు ఫీజులు చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండదు. అ తర్వాత రెన్యూవల్‌కు దరఖాస్తులు చేసుకుంటే 25 శాతం జరిమానా తీసుకుని ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. రహదారుల ఆధారంగా వాణిజ్య సముదాయలకు ట్రేడ్ లైసెన్స్‌కు రూ.200 నుంచి రూ.లక్షలోపు ఫీజులు ఉన్నాయి. అయితే బ్యాంకుల్లో రుణం పొందే వ్యాపారులు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నారు.
మిగతా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడానికి అసక్తి చూపడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో వేలాది వ్యాపార దుకాణాలున్నా ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకున్న వ్యాపారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా మున్సిపల్ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకోవాలంటే ఆస్తి పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపాలిటీలలో నిధులు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎలాంటి పరిష్కరం చూపలేకపోతున్నట్లు అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.