PD Act | మేడ్చల్, డిసెంబర్12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల, చెరువుల సమీపంలో కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల తర్వాత తిరిగి నిర్మిస్తే పీడీయాక్ట్ పెట్టేలా రెవెన్యూ యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువుల స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా సర్వే చేసి గుర్తించిన విషయం విధితమే. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.
కూల్చివేసిన తర్వాత తిరిగి నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో ఫిర్యాదులు వస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకునేలా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో వేలాది సంఖ్యలో ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చి వేయగా తిరిగి కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలలో భాగంగా పోలీస్‌శాఖను రెవెన్యూ యంత్రాంగం పీడీయాక్ట్‌ను కోరనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం 5,195 ఎకరాలు ఉండగా ఇటీవల రెవెన్యూ, నీటి పారుదలశాఖ నిర్వహించిన సర్వేలో వందలాది ఎకరాలు కబ్జాలకు గురైనట్లు లెక్క తేల్చినప్పటికి అ వివరాలను రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
తహసీల్దార్లదే బాధ్యత..
ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యతను తహసీల్దార్లకే కలెక్టర్ అప్పగించారు. కబ్జాలను గుర్తించి తిరిగి అ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు జరిగినట్లయితే పూర్తిగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేసే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కూల్చివేతలు చేసిన ప్రభుత్వ భూములలో ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డులతో పాటు ప్రహరీలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.