సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : నగర శివారులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మైనింగ్, పరిశ్రమలపై పొలుష్యన్ కంట్రోల్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పలు స్టోన్ క్రషర్లకు నోటీసులు జారీ చేసిన అధికారులు తాజాగా ఎన్జీటీకి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పీసీబీకి గ్రామస్తుల ఫిర్యాదు
నగర శివారుతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో స్టోన్, క్రషర్, రెడిమిక్స్, హాట్ మిక్స్‌తో పాటు కెమికల్ ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల కాలంలో నిర్మాణరంగం ఊపందుకోవడంతో రేయింబవళ్లు స్టోన్ క్రషర్స్ మిషన్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని బండ రావిర్యాల, చిన్న రావిర్యాల, తారామతిపేట్, దేశ్‌ముఖ్ గ్రామాలతో పాటు, అబ్దుల్లాపూర్‌మెట్, పోచంపల్లి, మేడ్చల్, తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా స్టోన్ క్రషర్ల యూనిట్ల నుంచి గాలి, ధ్వని కాలుష్యంతోపాటు స్థానికంగా ఉండే గ్రామాల వరకు భూ ప్రకంపనలు వ్యాప్తి చెందుతున్నాయని, దుమ్మూ, ధూళిలో ఆరోగ్యం దెబ్బతింటుందని ఇటీవల గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అధికం కావడంతో పీసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎన్జీటీ ఆదేశాలతో మరింత కట్టుదిట్టం
మైనింగ్ కార్యకలాపాలు, కెమికల్ ఫ్యాక్టరీలతో ఎదురవుతున్న ఇబ్బందులపై నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ పీసీబీ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మే రెండో వారం నుంచి క్షేత్రస్థాయి తనిఖీలతోపాటు నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే 14 స్టోన్ క్రషర్లకు నోటీసులు జారీ చేయగా, అవసరమైతే సీజ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.