‘రాజు అనే వ్యక్తి లైసెన్స్ కోసం స్లాట్ బుక్ కోసం ఆర్టీఏ వెబ్ సైట్లోకి వెళ్లాడు. వివరాలన్నీ ఇచ్చాడు. పేమెంట్ ప్రక్రియ పూర్తి చేశాడు. ఖాతా నుంచి డబ్బులు సేవకు సంబంధించినంత వెళ్లాయి. కానీ పేమెంట్ పూర్తయినట్టు వెబ్సైట్లో చూపించలేదు. ఇప్పుడు అతడికి స్లాట్ బుక్ అయిందా? లేదా? డబ్బులు చెల్లించినట్టు సందేశం ఎలా? అనే చిక్కులు వచ్చిపడ్డాయి.’
‘ప్రకాశ్ ఫ్యాన్సీ నంబర్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాడు. నంబర్‌కు సంబంధించిన అమౌంట్‌ను చెల్లించాడు. ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. కానీ అందుకు సంబంధించిన సందేశం మాత్రం రాలేదు. బిడ్డింగ్‌లో పోటీలో ఉన్నప్పటికీ లింక్ ఓపెన్ చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో అతడు నచ్చిన నంబర్ కోల్పోయాడు.
RTA | సిటీబ్యూరో: ఆర్టీఏలో సాంకేతిక సమస్యలు తిష్టవేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్లాట్ బుక్, వాహన పన్ను చెల్లింపులు, ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ తదితర ప్రక్రియల్లో వాహనదారులు ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ అవుతున్నాయి. కానీ కన్ఫర్మేషన్ సందేశాలు ఎలాంటివి కూడా రావడం లేదు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
ఆ వివరాలన్నీ పట్టుకొని ఆర్టీఏ అధికారుల వద్దకు వెళితే ఆన్లైన్ సర్వర్‌కు సంబంధించిన విషయం కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. ఆన్లైన్ సేవల్లో ఛార్జీ రూ. 10తో ముగిస్తే.. మీ సేవలో సుమారు 35 రూపాయల వరకు అదనంగా ఉంటుంది. ఆన్లైన్ సేవలపై రవాణా శాఖ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో క్షేత్రస్థాయి ఆర్టీఏ కార్యాలయాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు వాహనదారుల పాలిట శాపంగా మారాయి.
టీ యాప్ ఫోలియో ద్వారా..
కేసీఆర్ పాలనలో టీ యాప్ ఫోలియో ద్వారా ఆర్టీఏ ఆన్లైన్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే సుమారు ఆర్టీఏలో 17 సేవలను ఆన్లైన్ ద్వారా అందించారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ సేవలపై అధికారులు పర్యవేక్షించకపోవడంతో వాహనదారులు కార్యాలయాలు చుట్టు తిరిగి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తున్నది. మహేశ్ అనే వ్యక్తి వెహికల్ ట్రాన్స్ఫర్, స్లాట్ బుకింగ్‌కు సంబంధించిన వర్క్‌లో ఆన్లైన్లో వెయ్యికిపైగా ఫీజు చెల్లించాడు. అప్డేట్ కాలేదు. అతడు మళ్లీ మీసేవకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆన్లైన్లో చెల్లించినట్టు అధికారుల దృష్టికి తీసుకెళితే కన్ఫర్మేషన్ సందేశం చూపించాలని ఎదురు ప్రశ్నించడంతో కంగుతినాల్సి వచ్చింది.