ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ఆరోగ్యంగా ఉంటుంది…రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనేది కేసీఆర్ సర్కార్ సిద్ధాంతం. అందుకోసం గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌ను అన్ని విధాలుగా బలోపేతం చేసి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందింది. నగరవాసులకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఖరీదైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు మరింత చేరువ చేయడమే కాకుండా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు బీఆర్ఎస్ సర్కార్ పునాదులు వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ మాత్రం ఆ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడంతో ప్రస్తుతం సర్కారీ దవాఖానాలు వెంటిలేటర్‌పై ఉన్నాయనే విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. – ఫీచర్ స్టోరీ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చారిత్రాత్మకమైన మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. అందులో ఒకటి గాంధీ వైద్య కళాశాల, రెండవది ఉస్మానియా వైద్య కళాశాల. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ దవాఖాన ఉండగా, ఉస్మానియా వైద్య కళాశాల కింద ఉస్మానియా, నిలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలు, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్, ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానాలు రోగులకు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ దంత వైద్యశాల సేవలిందిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోనే మొత్తం 11 టీచింగ్ హాస్పిటల్స్ నిత్యం వేలాది మంది రోగులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి.
అయితే ఈ టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా నిజాం కాలం, బ్రిటిష్‌కాలం నాటివే. 50-60సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సర్కార్ ఈ దవాఖానలను ఆధునీకరించడం గాని వాటి సామర్థ్యాలను పెంచిన పాపాన పోలేదు. దీంతో నిజాం కాలంనాటి పరిస్థితులే ఉండటంతో 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దవాఖానలన్నింటినీ బలోపేతం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ దవాఖానల పడకల సామర్థ్యాన్ని 2వేలకు పెంచడం, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన సామర్థ్యాన్ని 250నుంచి 750పడకలకు పెంచడం, నిలోఫర్ సామర్థ్యాన్ని 500నుంచి వెయ్యికి పెంచడం ఇలా అన్ని దవాఖానల పడకల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కోట్ల రూపాయల వైద్య పరికరాలను సమకూర్చింది.
ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్ధేశ్యంతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్‌దే. ముఖ్యంగా దవాఖాన ప్రసవాలు పెంచడంతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో సహజ ప్రసవాలను పెంచి సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించింది. అంతే కాకుండా మాతాశిశు మరణాలను ఘననీయంగా తగ్గించగలిగింది. అన్నిరకాల మందులను ప్రభుత్వ దవాఖానల్లోనే పూర్తి ఉచితంగా ఇవ్వడం, వైద్యపరీక్షల కోసం ఆధునిక వైద్యపరికరాలను సమకూర్చడం వంటి చర్యలు చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలు ఎలాంటి భయం లేకుండా సర్కార్ దవాఖానాల్లో వైద్యం చేయించుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ దవాఖాల నిర్వహణను గాలికొదిలేయడంతో రెండేళ్లుగా సర్కార్ వైద్యం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ తదితర దవాఖానల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా అనుభవజ్ఞులైన వైద్యులను రోగులు లేని కొత్తగా ఏర్పాటవుతున్న వైద్యకళాశాలలకు పంపడం, సరైన అనుభవం లేని వైద్యులను జిల్లాల నుంచి తీసుకువచ్చి నగరంలోని ట్రెషరీ దవాఖానలకు బదిలీ చేయడం, దీనికి తోడు ఉస్మానియా, గాంధీ వంటి పెద్ద దవాఖానల్లో కాంట్రాక్ట్ వైద్యులను నియమించడంతో టీచింగ్ హాస్పిటళ్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. రోగులకు మెరుగైన వైద్యం అందకపోవడమే కాకుండా వైద్య విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
నిధుల విడుదలలో తీవ్ర జాప్యం..
గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలోని ఆయా దవాఖానల అవసరాలకు అనుగుణంగా బడ్జ్జెట్‌లో కేటాయింపులు జరగలేదని వైద్యసిబ్బంది ఆరోపిస్తున్నారు. దవాఖానాల పడకలు పెంచడం, కొత్త భవనాలు, కొత్త వైద్య పరికరాలు, దవాఖానాల విస్తరణపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ప్రతి 3నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన క్వార్టర్లీ నిధులను సకాలంలో విడుదల చేయడం లేదని ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. దీంతో సకాలంలో అత్యవసర మందులు కొనుగోలు చేయలేకపోతున్నామని, దవాఖానల్లోన్ని వైద్య పరికరాల నిర్వహణ, దవాఖానాలో పరిపాలన దారితప్పుతోందని వారు వాపోతున్నారు.
సరైన వైద్యం అందక
సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఫ్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో ఉండడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి, గంటల తరబడి ఓపీకోసం నిరీక్షించిన రోగులకు వైద్య విద్యార్థులే దిక్కవుతున్నారు. ఫలితంగా కొన్ని రకాల మొండి వ్యాధులు, ముఖ్యంగా స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. పాము కాటు, తేలు కాటుకు ఒకే మంత్రం అన్న చందంగా అనుభవం లేని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో ఉన్న రోగాలు తగ్గకపోగా అవి ముదిరి కొత్త రోగాలకు దారితీసే పరిస్థితి ఏర్పడినట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీలపైనే భారం
ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో లేకపోవడంతో వందల సంఖ్యలో వచ్చే రోగుల భారమంతా పీజీల పైననే పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని దవాఖానల్లో అయితే అసిస్టెంట్, అసోసియేట్ స్థాయి ప్రొఫెసర్లు కూడా ఓపీ విధుల్లో సరిగ్గా ఉండకపోవడంతో మొత్తం భారం పీజీలు, ఎస్ఆర్లపైననే పడుతున్నట్లు కొందరు వైద్యవిద్యార్థులు వాపోతున్నారు.
గాడి తప్పుతున్న వైద్య విద్య
అధికారులు, పాలకుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్య విద్య గాడితప్పుతోంది. ఒకప్పుడు ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలలో చదివిన వైద్యవిద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా వారి పేరు పక్కన ఉస్మానియా లేక గాంధీ అని పెట్టుకునేవారు. కాని ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయి. చాలామంది ప్రొఫెసర్లు అత్యం ముఖ్యమైన ఓపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో వైద్య విద్య గాడితప్పుతోదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనిచేయని వైద్యపరికరాలు
రెండేళ్ల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ వైద్యశాఖను వెంటిలేటర్‌పైకి నెట్టేసింది. నాటి బీఆర్ఎస్ హయాంలో సరిపోను వైద్య, నర్సింగ్, ఫార్మ, పారామెడికల్ సిబ్బందిని నియమించడమే కాకుండా అత్యాధునిక వైద్యపరికరాలు, మందులను సమకూర్చితే నేటి కాంగ్రెస్ సర్కార్ ఉన్నవాటిని కనీసం అలాగే అయిన ఉంచకుండా ఉన్నవి ఊడబీకి, కొత్తవి ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కోఠి ఈఎన్టి, ఎంఎన్‌జే తదితర దవాఖానలో వైద్య సదుపాయాల కొరత వేధిస్తోంది. సీటీ స్కాన్, ఎక్స్‌రే వంటి యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఎంఎన్జేలో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ థెరపీచికిత్స అందించే రెండు యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో వైద్యపరీక్షలన్నీ బయటనే చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
తగ్గిన శస్త్రచికిత్సలు
అనుభవజ్ఞులైన వైద్యులు లేకపోవడం, నిర్వహణ లోపంతో వైద్య పరికరాలు మొరాయించడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్టీ తదితర దవాఖానల్లో పలు రకాల శస్త్రచికిత్సలు భారీగా తగ్గిపోయినట్లు సమాచారం. చాలా వరకు శస్త్రచికిత్సలను వివిధ కారణాలతో వాయిదా వేస్తున్నట్లు రోగులు
ఆరోపిస్తున్నారు.
అరకొర మందులతోనే సరి..
టీచింగ్ హాస్పిటల్స్‌లో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు రాసిన మందుల్లో ఫార్మసిస్టులు సగం మాత్రమే ఇస్తుండగా మరికొన్ని మందులను బయట నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఐదు రోజులకు రాస్తే రెండు లేదా మూడు రోజులకే మందులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో అయితే అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవని రోగులు వాపోతున్నారు.