బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 3 : ప్రభుత్వ దవాఖానలలో రోగుల చికిత్స, చరిత్రను రికార్డు చేసి ఆన్లైన్లో భద్రపరచడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆధార్ నెంబర్‌ను వినియోగించనున్నారు. దాని వలన రోగి హెల్త్ హిస్టరీ గుర్తులేకపోయినా, ఓపీ చిట్టి లేకపోయినా రోగి వ్యక్తిగత, ఆరోగ్య వివరాలు అన్ని చోట్ల ప్రభుత్వ దవాఖానలలో ఆన్లైన్లో వైద్యులు చూసి చికిత్స అందించవచ్చు. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖాన, కింగ్ కోఠీలోని జిల్లా దవాఖాన, మలక్‌పేట్‌లోని ఏరియా దవాఖానలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వారం రోజులుగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది. ఇది విజయవంతం అయితే, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాలలో దశల వారీగా అమలులోకి తేనున్నారు.
ప్రయోగాత్మకంగా ‘గాంధీ’లో..
గాంధీ దవాఖానలో వైద్యం కోసం వస్తున్న ఓపీ రోగుల ఆధార్ నెంబర్, వేలి ముద్రలను సేకరిస్తున్నారు. వెంటనే అతడికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ (ఆభా నెంబర్) కేటాయిస్తున్నారు. ఆ తరువాత రోగి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని, ఓపీ చీటి ఇస్తారు. డాక్టర్‌ను సంప్రదించాక వారు సూచించిన వైద్య పరీక్షలు, మందుల వివరాలను ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ వివరాలను తెలంగాణలోని అన్ని ప్రభుత్వ దవాఖానలలో ఆన్లైన్లో చూడవచ్చు. అందువలన రెండోసారి వచ్చే రోగికి ఓపీ చిట్టి తీసుకురావలసిన అవసరం ఉండదు. ఆధార్ కార్డు నెంబర్ లేదా ఆభా నెంబర్ ఉంటే సరిపోతుంది.
వెంటనే ఆన్లైన్లో రోగి వయస్సు, చిరునామా లాంటి వ్యక్తిగత, ఆరోగ్య సంబందిత వివరాలు, గతంలో వైద్యులు రాసిన మందుల చీటి, వైద్య పరీక్షల రిపోర్టులు, ఆరోగ్య పరిస్థితి మొత్తం వివరాలు తెలిసిపోతాయి. రోగి గత చరిత్రను పరిశీలించి అతడికి అక్కడి వైద్యులు చికిత్స అందించడం సులభతరం అవుతుంది. రోగి వద్ద నుండి ఓపీ చిట్టి చిరిగిపోయినా, మరచిపోయినా, పోగొట్టుకున్నా అతడి హెల్త్ హిస్టరీ ఆన్లైన్లో భద్రంగా ఉంటుంది. గాంధీ దవాఖానలో ఓపీ, ఐపీ, ల్యాబ్, మెడికల్ రికార్డ్స్, బ్లడ్‌బ్యాంక్, దాలు ఇలా 23 రకాల రోజువారి కార్యకలాపాలను కంప్యూటరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు.