పటాన్ చెరు, అక్టోబర్ 16: రోడ్డు విస్తరణలో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొటున్న ఆటో డ్రైవర్ల సమస్యను పటాన్చెరు (Patancheru) బీఆర్ఎస్ కార్పొరేటర్ పరిష్కరించారు.
65వ జాతీయ రహదారి విస్తరణలో మట్టి కుప్పలను రోడ్డు పక్కన వేయడంతో ఆటో స్టాండ్ పూర్తిగా కనిపించకుండా పోయింది. దీంతో తమ ఇబ్బందులను స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి ఆటో డ్రైవర్లు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పటాన్చెరులో ఉన్న ఆటో స్టాండ్ వద్ద సమస్యను పరిశీలించి తన సొంత డబ్బులతో మట్టి పోసి ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేసిన కార్పొరేటర్‌కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మెట్టు కుమార్ మాట్లాడుతూ.. ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు గిరాకీ లేక ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, దీనికి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలను భారీ ఎత్తుగా వేయడంతో ఫ్రీడమ్ పార్క్ పక్కనున్న స్వయంకృషి ఆటో స్టాండ్ పూర్తిగా కనిపించక ప్రజలు ఆటోలు ఎక్కకపోవడంతో, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అన్నారు. ఆటోని నమ్ముకుని జీవిస్తున్న వారు ఈ సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆటో స్టాండ్‌కు అడ్డుగా ఉన్న మట్టి కుప్పలను జేసీబీ యంత్రాలతో సమతలంగా చేసి, ఆటో స్టాండ్ కనిపించేలా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి ఆటో యూనియన్ అధ్యక్షుడు నర్సింగ్ రావు గారు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.