తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 17 : తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే ధర్మనిధి సాహిత్య పురస్కారానికి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఎంపికయ్యారు. శ్రీధర్ రెడ్డి సతీమణి డాక్టర్ బి. విజయలక్ష్మి పరిషత్తులో నెలకొల్పిన ఎండోమెంట్ నుంచి ఏటా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మే ఒకటో తేదీన సాయంత్రం ఐదున్నరకు పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగే సభలో పూర్వ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పాశం యాదగిరికి పురస్కారం అందచేస్తారని ఆయన పేర్కొన్నారు. పురస్కారం కింద 25 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారని తెలిపారు.