బంజారాహిల్స్, జూన్ 13: నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ శ్రీగంధం చెట్లను నరుకుతున్న ఘరానా గ్యాంగ్‌లోని నలుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఐ మధుసూదన్ వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నం.5లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలప్రసాద్ ఇంటి ఆవరణలో ఉన్న శ్రీగంధం చెట్టును రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు నరికి చెక్కలను తస్కరించారు. మరుసటిరోజు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యా యి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని పార్థీ తెగకు చెందిన ముఠా శ్రీగంధం చెట్టును నరికి చోరీ చేసినట్లు తేలింది. మరింత లోతుగా విచారించగా మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మే 24, 31 తేదీల్లో నిమ్స్ మే ప్రాంగణంలో 9 శ్రీగంధం చెట్లను ఇదే గ్యాంగ్ నరికినట్లు తేలింది.
జూబ్లీహిల్స్‌లో శ్రీ గంధం చెట్టు నరికిన కేసులో దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు 40 నుంచి 50 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.5నుంచి ఉప్పల్ వరకు నిందితులు ఆటోలో ప్రయాణించినట్లు తేలింది. ఆటో డ్రైవర్‌ను విచారించగా కొంతమంది మహిళలు తన ఆటోలో ఎక్కి ఉప్పల్‌లో దిగారని తెలిపాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఉప్పల్ చెరువు సమీపంలో గాలించగా నలుగురు మహిళలు దొరికారు. పోలీసులను చూసి మరికొంతమంది పరుగులు పెట్టారు. పట్టుబడిన మహిళలను విచారించగా 20 రోజుల క్రితం మొత్తం 20 పార్థీ కుటుంబాలు నగరానికి వచ్చాయని, తామంతా పిల్లలు, పెద్దలతో కలిసి పగటిపూట రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట శ్రీ గంధం చెట్లను నరుకుతుంటామని అంగీకరించారు.
ఎవరికీ అనుమానం రాకుండా తామంతా లగేజీతో పాటు పిల్లలతో కలిసి తిరుగుతుంటామని, అత్యాధునిక కట్టర్లు ఉపయోగించి శబ్దం రాకుండా శ్రీగంధం చెట్లను నరికి గంధం చెక్కలను చోరీ చేస్తామని, మార్కెట్లో గ్రేడ్లను బట్టి టన్నుకు రూ.9వేల నుంచి 18వేల దాకా ధర పలుకుతుందని వెల్లడించారు. కాలనీల్లో తిరుగుతూ వస్తువులు అమ్ముతున్నట్లు నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా శ్రీగంధం చెట్లను గుర్తిస్తారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన పాలన్ బాయి పర్థీ(26), షాహనాజ్ బాయ్(35), నిమత్ బాయి(43), మాధురీ ఆదివాసీ(25)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో 19మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.