International School | శామీర్‌పేట, నవంబర్ 4: ఆడుకుంటామని అడిగితే.. వాతలు వచ్చేలే కొట్టి.. ఎవ్వరికైనా చెబితే చంపేస్తామంటూ స్కూల్ యాజమాన్యం బెదిరించింది. సోమవారం పేరెంట్స్ మీటింగ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా ఘనపురం గ్రామానికి చెందిన రమేశ్ నాయక్ తన కుమారుడిని శామీర్‌పేటలోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తూ.. హాస్టల్లో చేర్పించాడు. అక్టోబర్ నెలలో పేరెంట్స్ మీటింగ్ ఉండటంతో పాఠశాలకు వచ్చిన రమేశ్‌నాయక్.. తన కొడుకు దిగాలుగా ఉండడాన్ని గమనించి.. ఏమైనా ఇబ్బంది ఉన్నదా.. అని అడిగాడు.
ఒక్కసారిగా ఆ బాలుడు బోరుమని విలపిస్తూ స్కూల్ యాజమాన్యం చేసిన ఘాతుకాన్ని వివరించాడు. మీటింగ్‌కు రెండు రోజుల ముందు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటామని ప్రిన్సిపాల్‌ను అడగడంతో.. ఉపాధ్యాయులు, చైర్మన్ కొడుకు అభిలాష్ కలిసి విచక్షణారహితంగా దాడి చేశారంటూ వివరించి, వీపుపై ఉన్న వాతలను చూపించాడు. తనతో పాటు మరో ఆరుగుర్ని గదిలో బంధించారని చెప్పాడు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అక్టోబర్ 31న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఆడుకోవడం నేరమా, ఆడుకుంటామని ప్రిన్సిపాల్‌ను అడగడం ఘోరమా.. అని నిలిదీశారు. విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయులు రఫి, చైర్మన్ కొడుకు అభిలాష్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట గాయాలతో ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ తెలిపారు.