సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్లు రెప్పపాటు కాలంలో మన దృష్టిని ఆకర్షిస్తాయి. చటుక్కున మన చూపులను తమ వైపుకు తిప్పుకుంటాయి. ఏ రకమైనా వాహనమైనా సరే దానిపై ఓ ఫ్యాన్సీ నంబర్ ఉంటే ఆ దర్పం వేరుగా ఉంటుంది. ఎంతటి ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్నా సరే అటువంటి ఫ్యాన్సీ నంబర్ కనబడగానే అప్రయత్నంగా అందరూ అటువైపు ఓ లుక్కేస్తారు. అంత క్రేజీ ఉంటుంది కాబట్టే కొంతమంది యజమానులు తమ వాహనాలపై తమకు నచ్చిన అటువంటి నంబర్లనే ప్రింట్ చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. మరికొంతమందికి నంబర్లపై సెంటిమెంట్ ఉంటుంది. ఇంకొంతమందికి ప్రత్యేక నమ్మకాలు ఉంటాయి. అందుకే అటువంటి ఫ్యాన్సీ నంబర్ల కోసం కోటీశ్వరులు పోటీ పడుతూనే ఉంటారు. ఇటీవల కొందరు యజమానులు తమ కంపెనీ కార్లకు అలాంటి ఫ్యాన్సీ నంబర్లే కావాలంటూ పోటీ పడ్డారు. లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు.
ఫ్యాన్సీ నంబరు దరఖాస్తు ఇలా..!!
ఫ్యాన్సీ నంబర్ కావాలనుకున్నవాళ్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి కుడివైపు ‘ఆన్లైన్ సర్వీసెస్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నంబర్ రిజర్వేషన్ ఆనే లింకు కనబడుతుంది. దానిని ఓపెన్ చేస్తే ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్లు ప్రత్యక్షమవుతాయి. మనకు నచ్చిన నంబర్‌ను పేర్కొంటూ వాహన టీఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ వేలంలో డబ్బులు చెల్లించాలి. నంబర్ రిజర్వేషన్ కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్ మొత్తాన్ని చెల్లిస్తే 5 గంటల వరకు నంబర్ ఖరారై ప్రింట్ వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు సందేశం వస్తుంది.
ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు.. పారదర్శకంగా
ఫ్యాన్సీ నంబర్ల కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కొన్ని కంపెనీలు కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీపడుతున్నారు. అటువంటి నంబర్లు కావాల్సిన వారు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలి. ఎవరు ఎక్కువగా కోట్ చేస్తే వాళ్లకే ఆ నంబర్ దక్కుతుంది. నంబర్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా ఉంటుంది
-పి.రవీందర్ కుమార్, ఆర్టీఓ, ఉప్పల్.