మేడ్చల్, మార్చి 2(నమస్తే తెలంగాణ): రేషన్‌కార్డుల కోసం లక్ష పైచిలుకు దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 6,700 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మిగతా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26న వివిధ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం ..పథకాలను ప్రజలకు అందజేయడంలో మాత్రం అంతగా ముందుకు పోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రేషన్‌కార్డులను కొంత మంది లబ్ధిదారులకు మాత్రమే అందజేశారు. అందజేసిన రేషన్ కార్డులు జారీ అయిన వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాగా మిగతా అర్హులకు రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మిగతా దరఖాస్తుదారులకు మంజూరు చేసేందుకు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని, జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఎప్పుడు అందజేస్తారని అధికారులకు అడుగుతున్నారు.