బడంగ్పేట్, జనవరి 12: బడంగ్‌పేట్‌ను జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. అన్ని పార్టీల నాయకులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడంగ్‌పేట్‌ను జోనల్ కార్యాలయం చేయకుండా శంషాబాద్‌లో విలీనం చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డివిజన్ల ఏర్పాటు అస్తవ్యస్తంగా చేయడమే కాకుండా జోనల్ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని వా రు ఆగ్రహంగా ఉన్నారు. శంషాబాద్ జోన్ లో బడంగ్పేట్ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం రెండు డివిజన్లు ఉన్న శంషాబాద్‌ను జోనల్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఏ ప్రాతిపదికన డివిజన్ల ఏర్పాటు?
డివిజన్ల ఏర్పాటుకు ఏ ప్రాతిపదికను తీసుకున్నారో చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జనాభ, విస్తీర్ణం ప్రాతిపాదికన అధికారులు నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండా హడావిడిగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. మీర్పేట్, జిల్లెలగూడ, ప్రశాంత్ హిల్స్, నాదర్‌గూల్, బడంగ్పేట్, బాలాపూర్, జల్పల్లి, షాహిన్‌నగర్, పహాడీషరీఫ్, జల్పల్లి, తొర్రూరు, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్, తుక్కుగూడ, మాంకాల్ డివిజన్లకు బడంగ్పేట్ జోనల్ కార్యాలయం చేస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని వివిధ పార్టీల నాయకులు, కాలనీ అసోసియేషన్ నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్‌కు సంబంధించినవి రెండు డివిజన్లు ఉంటే జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడంగ్పేట్ సర్కిల్‌ను మొదట చార్మినార్ జోనల్లో విలీనం చేశారు. స్థానికంగా వ్యతిరేకత రావడంతో శంషాబాద్ జోనల్లో విలీనం చేశారు. వెంటనే శంషాబాద్ జోన్ నుంచి బడంగ్‌పేట్‌ను వేరుచేయాలని రాజకీయ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బడంగ్పేట్ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదని పొలిటికల్ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో విలీనం చేసే కుట్ర..
బడంగ్పేట్ సర్కిల్‌ను శంషాబాద్ జోనల్లో కల్పడమే సరికాదంటున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లో విలీనం చేసే కుట్ర జరుగుతోందని వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే శంషాబాద్ జోనల్ పరిధిలో ఉన్న మీర్పేట్, జిల్లెలగూడ, ప్రశాంత్ హిల్స్, నాదర్‌గూల్, బడంగ్పేట్, బాలాపూర్, జల్పల్లి, షాహిన్ నగర్, పహాడీషరీఫ్, జల్పల్లి, తొర్రూరు, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్, తుక్కుగూడ, మాంకాల్ డివిజన్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటికే దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో మైనార్టీల ప్రాబల్యం ఉన్న చోట బడంగ్పేట్ సర్కిల్, ఆదిబట్ల సర్కిళ్ల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు.