ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవలి కాలంలో యూనివర్సిటీల దైనందిన పాలనలో ఉన్నత విద్యామండలి మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ఓయూ ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ మండలి కార్యదర్శికి ఈనెల 2వ తేదీన లేఖ రాయగా, ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లేఖను ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి సైతం పంపించారు. ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మండలి వైఖరి వర్సిటీ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
కొత్త కోర్సుల ప్రారంభంపై రేగిన దుమారం..
ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండలి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని తెలుగు విభాగంలో బీఏ తెలుగు హానర్స్ కోర్సును 2025-26 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. టెక్నాలజీ కళాశాలలో బీటెక్ (బయో టెక్నాలజీ) కోర్సును ప్రవేశపెట్టాలని మండలి ఓయూ రిజిస్ట్రార్‌కు ఈనెల 1న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన వర్సిటీ అధికారులు మండలికి తిరుగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ పంపించారు. ఆర్ట్స్ కళాశాలలో కేవలం పీజీ, పీహెచ్డీ కోర్సులు మాత్రమే అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
వర్సిటీ యంత్రాంగంతో చర్చించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు ప్రతిపాదనను సైతం వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే పలు వినతులు వచ్చినప్పటికీ, కోర్సు ప్రారంభానికి సరిపడా తరగతి గదులు, హాస్టల్ సదుపాయాలు, ల్యాబ్‌లు నెలకొల్పేందుకు సరిపడా మౌలిక వసతులు కావాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీ కళాశాలలో వీటన్నింటితో పాటు సరిపడా రెగ్యులర్ ఫ్యాకల్టీ సైతం లేదని పేర్కొన్నారు. ఇటీవలి పరిణామాలపై ఆగ్రహం..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వివిధ విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలని వర్సిటీపై.. ఉన్నత విద్యా మండలి ఒత్తిడి తీసుకువస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ యంత్రాంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇంజినీరింగ్, యూజీ కోర్సుల పాఠ్యప్రణాళిక మార్పు కోసం మండలి స్వయంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలను నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. విద్యాపరమైన నిర్ణయాలన్నీ వివిధ విద్యాస్థాయి సమావేశాల్లో చర్చించి, తీసుకుంటారని వివరించారు. కానీ, ఉన్నత విద్యామండలి.. వర్సిటీతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విద్యారంగ నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేదని ఆవేదన..
108 ఏళ్ల పురాతన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు బోర్డ్ ఆఫ్ స్టడీస్, స్టాండింగ్ కమిటీ, అకాడమిక్ సెనేట్ వంటివి ఉన్నాయని చెప్పారు. వివిధ యూజీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం, పాఠ్యప్రణాళికను మార్చడం వంటివాటిని ఆయా కమిటీలే చూసుకుంటాయని పేర్కొన్నారు. 2024-25 విద్యాసంవత్సరం వరకు యూజీ ఆల్మనాక్ను యూనివర్సిటీ స్థాయిలోనే నిర్ణయించేవారని గుర్తుచేశారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఆల్మనాక్ రూపకల్పనలో ఉన్నత విద్యా మండలి అనవసర జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు.
విద్యాశాఖకు మంత్రిగా సాక్షాత్తూ ముఖ్యమంత్రే బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ వ్యవహారంపై వర్సిటీ అధ్యాపక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.