OTS | సిటీబ్యూరో: దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జలమండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ఆట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండు నెలల పాటు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా..శనివారంతో ఈ గడువు ముగిసింది. కేవలం దాదాపు లక్షకు పైగా ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోగా, జలమండలి కేవలం రూ.110 కోట్లు మాత్రమే ఆదాయాన్ని సమకూర్చుకున్నది. వాస్తవంగా డొమెస్టిక్, డొమెస్టిక్ స్లమ్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, ఎంఎస్బీ, బల్క్, కాలనీలు, ప్రభుత్వ, కేంద్ర రంగ సంస్థలు కలిపి 7.18 లక్షల కనెక్షన్లకు ఓటీఎస్ వర్తింపు కాగా.. వీటి నుంచి రూ. 1961 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని జలమండలి అంచనా వేసింది.
ఇందులో రూ.705 కోట్ల మేర వడ్డీ మాఫీ కానున్నది. రూ. 1255 కోట్ల మేర బకాయిలు వసూలు చేయడమే లక్ష్యంగా ఓటీఎస్‌ను డివిజన్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినా.. ఫలితం లేదు..దీనికి కారణాలు లేకపోలేదు.ఓటీఎస్ జీవో వెలువడిన తర్వాతనే జలమండలి విధి విధానాలు రూపొందించి దాదాపు 17 రోజుల పాటు సమయం తీసుకున్నది. దీనికితోడు దసరా, దీపావళి జంట పండగలు వచ్చాయి. 90 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువ శాతం సిబ్బంది సమయం కేటాయించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కరువైంది. అన్నింటికంటే ముందు ఆఫిడవిట్, సెల్ఫ్ డిక్లరేషన్‌పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గతంలో దాదాపు ఓటీఎస్ రూపంలో రూ. 250కోట్లకు పైగా ఉంటే ఈ సారి మాత్రం జలమండలి రూ.110కోట్లకే సరిపెట్టుకున్నది. కాగా ఓటీఎస్ సద్వినియోగం చేసుకోని వారి నల్లా కనెక్షన్లను తొలగిస్తామని జలమండలి హెచ్చరికలు జారీ చేస్తుండడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.