Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ వేడుకలు ఈనెల 19న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభంకానున్నాయి. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథిగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో 2022 – 2023, 2023 – 2024 విద్యా సంవత్సరాలలో స్వర్ణ పతకాలతోపాటు 2023 అక్టోబర్ నుంచి 2025 ఆగస్టు వరకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారు.
ఈ వేడుకల్లో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్యఅతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania. ac.in లో చూడొచ్చని అధికారులు తెలిపారు.
ప్రతిష్టాత్మకం ఓయూ గౌరవ డాక్టరేట్
ప్రతి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయరు. ఇప్పటి వరకు కేవలం 49 మందికి మాత్రమే ఓయూ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. చివరిసారిగా 2023లో అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌కు గౌరవ డాక్టరేట్ అందించింది. ఈ ఏడాది గౌరవ డాక్టరేట్ అంశం ఇంకా అధికారులు బహిర్గతం చేయలేదు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి
స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు స్నాతకోత్సవానికి రెండ్రోజుల ముందుగా ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి కార్యాలయంలో సంప్రదించి గుర్తింపుకార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరూ విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సంప్రదాయం ప్రకారం అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చుకోవాలని తెలిపారు.
57 బంగారు పతకాల ప్రదానం
స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్డీలలో స్వర్ణ పతకాలు సాధించిన 57 మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు దాదాపు వందల సంఖ్యలో పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. యూజీలో స్వర్ణ పతకాలు సాధించిన వారికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.
రెండేళ్ల కిందట 83వ స్నాతకోత్సవం
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం 84వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్నాతకోత్సవంలో పతకాలు, పట్టాలు పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా భావిస్తారు. ఈ స్నాతకోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం లేదు. చివరిసారిగా 83వ స్నాతకోత్సవాన్ని 2023 అక్టోబర్ 31న నిర్వహించారు.