“ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. నిధుల లేమి సమస్యతో విశ్వవిద్యాలయం మసకబారుతున్నది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో అగమ్యగోచరంగా మారింది. గత ఆగస్టులో వర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇస్తానని ఆర్ట్స్ కళాశాల వేదికగా వరాల జల్లు కురిపించి.. ఏఒక్కటి కూడా నెరవేర్చక పోగా మోసం చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఇది చేశాం..అదిచేశాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ లేకపోవడంతో కొన్ని విభాగాలు మూతపడుతున్నాయని.. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు.”
-ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4 : ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో ఊగిసలాడుతోంది. సరిపడా నిధులు లేకపోవడంతో కొట్టుమిట్టాడుతోంది. వెయ్యి రోజుల ప్రజాపాలనలో అది చేశాం.. ఇది చేశాం.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్న ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓయూ దీనస్థితి ఓ చెంపపెట్టు. ప్రజాప్రభుత్వానికి గొంతులో వెలక్కాయలా మారిన ఉస్మానియాను కాలగర్భంలో కలిపేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపరీతమైన హామీలిచ్చి, విద్యార్థులు, యువత, నిరుద్యోగులను తమ వైపు తిప్పుకుని ఇప్పుడు మోసం చేశారని మండిపడుతున్నారు. నిధుల లేమితో విశ్వవిద్యాలయం కొట్టుమిట్టాడుతోంది. ఎంతగా అంటే.. అభివృద్ధి కార్యక్రమాలు దేవుడెరుగు.. ఉద్యోగుల వేతనాలకూ కటకటగానే ఉంది వర్సిటీ ఆర్థిక పరిస్థితి. ఎన్నికల సమయంలో బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వర్సిటీకి ప్రభుత్వ ఆదరువు ఉండే బ్లాక్ గ్రాంట్‌ను నామమాత్రంగా మాత్రమే పెంచడంతో వర్సిటీ నిర్వహణ భారంగా మారింది.
యూనివర్సిటీ ఫ్యాకల్టీ కొరత వేధిస్తోంది. దీంతో విద్యాబోధనతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇప్పటికే పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో కొన్ని విభాగాలు మూతపడగా, మరికొన్ని విభాగాలు కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతోనే పనిచేస్తున్నాయి. ఇంకొన్ని విభాగాలు కేవలం ఒకరిద్దరు ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నాయి. ఇది పూర్తిగా వర్సిటీ నాణ్యతపై ప్రభావం పడడంతో పాటు యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్, వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలు ఇచ్చే ప్రాజెక్టులు సైతం ప్రభావితం అవుతున్నాయి.
మొత్తం మంజూరైన అధ్యాపక పోస్టులు – 1280
ప్రస్తుతం పనిచేస్తున్నవారు – 320
కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారు – 220
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నవారు – 130
పార్ట్‌టైం ప్రాతిపదికన పనిచేస్తున్నవారు – 250
ఆర్ట్స్ కళాశాల వేదికగా నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి వర్సిటీకి వరాల జల్లు కురింపించారు. కానీ వాటిలో ఏ ఒక్కటి నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు కోరగా, సానుకూలంగా స్పందించిన సీఎం ఇప్పటికే ఉన్న కమిటీలో చర్చించుకుని పోస్టులను భర్తీ చేయాలని, రాజకీయ పైరవీలకు ఎటువంటి చోటు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కానీ ఆ దిశగా అడుగు కూడా ముందుకు పడకపోవడం విశేషం. రూ.వెయ్యి కోట్లతో ఓయూను ప్రపంచస్థాయి యూనిర్సిటీగా తీర్చిదిద్దేందుకు మూడు నమూనాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నమూనాలను అందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు, అందరి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం ఈ నెలాఖరున నిర్మాణాలను ఖరారు చేస్తామని ప్రకటించారు. నెలాఖరు దాటి ఎనిమిది నెలలు గడిచిపోయినా ఆ నమూనాలకు అతీగతీ లేకుండా పోయింది.
వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఎవరు బాగుకున్నారో ప్రభుత్వానికే తెలియాలని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి, తీరా గద్దెనెక్కిన తరువాత ఖజానా ఖాళీ అనడం రేవంత్‌రెడ్డికే చెల్లిందని మండిపడుతున్నారు. గత ఆగస్టులో ఓయూకు వచ్చిన రేవంత్‌రెడ్డి అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ చెప్పుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. గత పర్యటనలో హామీ ఇచ్చినట్లు ‘డిసెంబర్లో తిరిగి ఓయూకు వస్తా… ఒక్క పోలీసు ఉండకుండా ఆర్ట్స్ కళాశాల వేదికగా సభ నిర్వహించుకుందాం… నిరసనలు తెలిపే వాళ్లను తెలపనీ… స్వేచ్ఛాయుత వాతావరణంలో సభ జరుపుకుం దాం… అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటా… వర్సిటీ అభివృద్ధికి అవసరమైతే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తా’అని ప్రకటించారని చెప్పారు. డిసెంబర్లో తిరిగి ఓయూకు వస్తానన్న మాట ఒక్కటి నిలబెట్టుకోవడం తప్ప మిగిలిన దేనిని పట్టించుకోకుండా పర్యటన సాగిందని మండిపడుతున్నారు.
విద్యార్థులకు ఇప్పటికే ఉన్న హాస్టల్ వసతి ఏ మాత్రం సరిపోవడం లేదు. మరోవైపు లా, టెక్నాలజీ కళాశాలల విద్యార్థుల హాస్టల్ భవనాలు పాతవి అయిపోయాయి. ఇప్పటికీ అలాగే నెట్టుకొస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో పెచ్చులూడి పడడం లాంటి ఘటనలు సంభవిస్తుండడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నూతన భవనాలు నిర్మించడం దేవుడెరుగు.. ఉన్న భవనాలకు సైతం మరమ్మతులు చేయించమని అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని విద్యార్థులు బావురుమంటున్నారు.