Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా ఉద్యమ కెరటం షహీద్ మేరెడ్డి చంద్రారెడ్డి వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చంద్రారెడ్డి చిత్రపటానికి ఈ సందర్భంగా నివాళి అర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. మేరెడ్డి చంద్రారెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రాంతం నుంచి యూనివర్సిటీకి ఉన్నత చదువులకోసం వచ్చి చదువుతో పాటు సామాజిక స్పృహతో నిరుపేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాడారని కొనియాడారు. ఆ తరుణంలో విద్యార్థులకు, యూనివర్సిటీకి ఒక ఐకాన్‌గా మారారని గుర్తు చేశారు. చంద్రన్న నాయకత్వంలో విద్యార్థులు అందరూ జాతీయవాద లక్షణాలను పెంపొందించుకొని నేషన్ ఫస్ట్ ఫిలాసఫీతో ముందుకు కదులుతున్న సమయంలో వామపక్ష, నక్షలైట్ భావజాలం కలిగిన వారికి కంటగింపుగా మారారని, దాంతో మార్చ్ 4, 1997 రోజున తుపాకులతో కాల్చి హత్య చేశారని చెప్పారు. చంద్రన్న తుపాకీ గుళ్లను సైతం లెక్కచేయకుండా నరహంతక నక్సలైట్లను తరుముతూ కుప్పకూలారని వివరించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, దేశ భక్తిని కలిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, రాష్ట్ర కార్యసమితి సభ్యులు కమల్ సురేష్, విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరిప్రసాద్, కళ్యాణ్, శేఖర్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శ్రీధర్, చిరంజీవి, కోటేశ్వర్, శ్రీకర్, హరిచందన్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.