Hyderabad | సిటీబ్యూరో/ మెహిదీపట్నం, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి అన్న చందంగా హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. కార్వాన్‌లోని లంగర్ హౌజ్‌లోని ఆర్చిడ్స్ ఇంటర్నేషన్ స్కూల్‌కు అనుమతి లేదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు సోమవారం రద్దు చేశారు. అయితే ఈ రద్దు నిర్ణయంపై తల్లిండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 800 మంది విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు.
ఇన్ని నెలలుగా స్కూల్ నడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోని విద్యాశాఖ అధికారులు మరో నెలన్నర రోజులైతే అకాడమిక్ పూర్తై వేసవి సెలవులు రాబోతున్న సమయంలో పాఠశాలకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఏర్పాటుకు ప్రాథమిక అనుమతినిచ్చినా విద్యాశాఖాధికారులు అడ్మిషన్లు జరుగుతున్న సమయంలోనూ నోరు మెదపకుండా చోద్యం చూశారు.
నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తీరా అకాడమిక్ ముగింపునకు వస్తున్న సమయంలో పాఠశాలను రద్దు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ నోఓసీ, ఫైర్ ఎన్ఓసీ, ట్రాఫిక్ ఎన్ఓసీ లేదని స్కూల్ రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. స్కూల్‌కు అనుమతి లేని విషయం తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుందని.. అంత పెద్ద బిల్డింగ్ నిర్మాణం జరిగి అది స్కూల్‌గా ఏర్పాటు చేస్తున్నా జిల్లా విద్యాశాఖాధికారికి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని రాజు అనే పేరేంట్ ప్రశ్నించారు.
ఇప్పుడు వేరే స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే చాలా కష్టమని తెలిపాడు. పరీక్షల సమయంలో వేరే స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడి వాతావరణం, కొత్త విద్యార్థులు, టీచర్లతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. చెల్లించిన ఫీజులు వెనక్కి ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించాడు. కాగా, ఇదే ప్రాంతలో కిలో మీటర్ లోపున ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు అందేల చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
బాధ్యత లేని విద్యాశాఖ..!
జిల్లాలో 3వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. చాలా ప్రయివేట్ పాఠశాలలు అనుమతి లేకుండానే నడుస్తున్నాయని విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం ఉండటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా చీకటి గదుల్లో పాఠశాలలను నడుపుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఎలాంటి ఫైర్ సేఫ్టీ కూడా ఉండటం లేదు.
ముఖ్యంగా ఎలాంటి ఆటస్థలం కూడా ఉండటం లేదు. రద్దీగా ఉండే రహదారుల పక్కన ఉన్న పురాతన భవనాల్లో సైతం పాఠశాలలను ఏర్పాటు చేసి బోర్డులు తగిలిస్తున్నారు. ఇక ఫీజులపై విద్యాశాఖ అధికారుల నియంత్రనే లేదని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న హైదరాబాద్ విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కేవలం ఫిర్యాదు వస్తేనే స్పందించి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనలు లేని పాఠశాల యాజమాన్యాలు కొందరి అధికారులకు డబ్బులను ఎరవేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.