అంబర్‌పేట, అక్టోబర్ 13: కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నికకోసం నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. అరగంట పాటు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి బాగ్‌అంబర్‌పేట ధృవ్ ఎలైట్ హోటల్లో సోమవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా వచ్చిన శక్తిసింగ్ గోయలె ఓ గదిలో అభిప్రాయ సేకరణ చేస్తుండగా బయట గొడవ చోటుచేసుకుంది.
అంబర్‌పేట నియోజకవర్గానికి సంబంధం లేని కొందరు నాయకులు అక్కడకు రాగా.. మీకు సంబంధం లేని సమావేశంలో ఎందుకు వచ్చారని ఇతర కార్యకర్తలు ప్రశ్నించారు. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పినా వారు వెళ్లకపోవడంతో కొందరు వాళ్లను తోసుకుంటూ వెళ్లారు. దీనికి తోడు అభిప్రాయాలు చెప్పడానికి నేను ముందు వెళ్తానంటే.. నేను వెళ్తా అంటూ ఒకరినొకరు నెట్టుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి కలుగజేసుకొని.. లొల్లి చేసే అందరిమీద అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా.. ఇక్కడ పహిల్వాన్‌గిరి చేస్తే నడవదు అని హెచ్చరించారు. వేరే నియోజకర్గం నుంచి వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.