సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టించి ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశచూపిన సైబర్‌నేరగాళ్లు నగరవాసి దగ్గర నుంచి రూ.12.56లక్షలు కొట్టేశారు. బేగంబజార్‌కు చెందిన 25ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తుండగా మోతీలాల్‌ఓస్వాల్ లోగోతో ఒక యాడ్ కనిపించింది. వెంటనే దానిని నిజమైనదిగా భావించి క్లిక్ చేయగా ఎల్47 క్వాంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనే వాట్సాప్ సమూహం కనిపించి అందులో స్టాక్ కొనుగోళ్లకు సంబంధించిన సూచనలు కనిపించాయి.
ఇది నిజమని నమ్మిన బాధితుడు ఎంఓడీఎంఏ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టగా, అవి పెరిగినట్లు కనిపించి పలు లావాదేవీల్లో డబ్బులు పంపించారు. బ్యాలెన్స్ రూ.46,89,375 చూపించడంతో తన డబ్బులు విత్ డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే అవి జరగకపోవడంతో స్కామర్స్ను సంప్రదించారు. వారు మరో రూ.7లక్షలు చెల్లించాలని డిమాండ్‌చేస్తే అతను నిరాకరించడంతో వారు బాధితుడిని బెదిరించి అతని అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఈ మోసంలో బాధితుడు రూ.12,56,900లు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.