మేడ్చల్, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్న నిరుపేదలు 20నెలలుగా భూ క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 58, 59 జీవోల కింద వాటిని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులను స్వీకరించిన విషయం విదితమే.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నవాటిని క్రమబద్ధీకరించే విధంగా అప్పుడే దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేసి దరఖాస్తుదారులకు క్రమబద్దీకరించే విధంగా చర్యలు తీసుకున్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల పక్రియ ప్రారంభమవడంతో.. ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 58, 59 జీవోలో వచ్చిన దరఖాస్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 15 మండలాల నుంచి 58, 59 జీవోకు సబంధించి 41,992 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 58 జీవో కింద 26,092 దరఖాస్తులు రాగా 59 జీవో కింద 15,200 దరఖాస్తులు వచ్చాయి. భూ క్రమద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము తక్షణమే క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయి.. అర్హులను కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై దరఖాస్తుదారులు నిరుత్సాహంతో ఉన్నారు. అప్పట్లోనే క్రమబద్ధ్దీకరణ కోసం 59 జీవోలో 3,609 మంది ఫీజులు చెల్లించినా క్రమబద్దీకరించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.