సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.. ట్రాఫిక్ చిక్కుముడికి కారణమవుతున్నది. చేయాల్సిన సమయంలో పనులు చేయకుండా.. అవాంతరాయలు ఎదురయ్యే వర్షాకాల సీజన్లో హడావుడి చేయడం జీహెచ్ఎంసీ అధికారులకు ఆనవాయితీగా వస్తున్నది. వానాకాలం ముందుగానే పురోగతిలో ఉన్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి..నీరు సాఫీగా వెళ్లేలా చేయాల్సిన అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. వర్షాకాలంలో పనులు చేపడుతుండటంతో వాహనదారులకు చిక్కులు కనిపిస్తున్నాయి.
ఓపికకు పరీక్ష పెట్టాల్సిందే..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి వయా కృష్ణానగర్ మీదుగా యూసుఫ్‌గూడ వెళ్లే ప్రధాన మార్గంలో నిత్యం వాహనాలతో కిక్కిరిసి పోయి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇలా ఉంటే గడిచిన కొన్ని రోజులుగా చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వరకు ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటాలంటే సగటు వాహనదారుడి ఓపికకు పరీక్ష పెట్టాల్సిందే. ఈ ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణం వరద నీటికాలువ నిర్మాణం అని చెప్పక తప్పదు. అసలే ఇరుకైన రహదారి..ఆపై వరద నీటి కాలువ నిర్మాణ పనులతో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతున్న వేళ. పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి..
గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న వరద కాలువ సామర్థ్యాన్ని మించి వర్షపాతం నమోదవుతుండడంతో వాటిని బలోపేతం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1302 కిలోమీటర్ల పొడవులో స్ట్రామ్ వాటర్ డ్రైయిన్స్ (ఎస్‌డబ్ల్యూడీ) చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 653 ప్రాంతాలను ఎంపిక చేయగా, రూ. 36,985 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 93 ప్రాంతాల్లో రూ.4227 కోట్లు ఖర్చు చేసి స్ట్రామ్ వాటర్ డ్రైయిన్స్ పనులను పూర్తి చేసి వరద కష్టాల నుంచి స్థానికులకు ఉపశమనం కల్పించారు. అయితే 560 ప్రాంతాల్లో రూ. 32,757 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. కృష్ణానగర్ తరహాలోనే నత్తనడకన జరుగుతున్న చోట్ల ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుండటం గమనార్హం.