Hyderabad | మెహిదీపట్నం, ఆగస్టు 25: నాలుగో అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగేందుకు లిఫ్టు వద్దకు వచ్చాడు. లిఫ్టు డోర్ తెరుచుకుంది. లిఫ్టు వచ్చినట్టుగా భావించిన అతడు కాలు లోపల పెట్టడంతో.. ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం ప్రియా కాలనీలోని వకాస్ స్కేర్ అపార్టుమెంట్ నివాసి సమీవుల్లా బేగ్(55) వ్యాపారి. ఆదివారం సాయంత్రం అపార్టుమెంట్ నుంచి కిందకు వచ్చేందుకు అతడు లిఫ్ట్ వద్దకు చేరుకున్నాడు. లిఫ్ట్ వచ్చినట్టు భావించి..దాని డోర్ తీసి లోపల అడుగుపెట్టాడు. అక్కడ లిఫ్ట్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. నాలుగో అంతస్తు పైనుంచి పడటంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.