సిటీబ్యూరో: పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామంటూ ఆశ చూపి రూ. ఆరు కోట్లతో బిచాణా ఎత్తేసిన ఫిబ్వేవ్ అనాలటిక్స్ సంస్థ నిర్వాహకుల్లో ఒక నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ(క్రైమ్స్) డీసీపీ ముత్యంరెడ్డి కథనం ప్రకారం.. సైబరాబాద్ పరిధిలోని సైరస్ హర్మస్‌జీ, నికిల్‌కుమార్ గోయెల్ తదితరులు ఫిబ్ వేవ్ అనాలటిక్స్ ఎల్ఎల్పీ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 30 శాతం నుంచి 48 శాతం వరకు ఏడాదికి లాభాలిస్తామంటూ నమ్మించారు. కొత్తగా చేరిన వారికి ఒక రకంగా, వాళ్లు ఇతరులను స్కీమ్‌ల్లో చేర్పిస్తే మరింత ఎక్కువగా లాభాలిస్తామంటూ.. మాటలు చెబుతూ రెఫరల్ సిస్టం ద్వారా 60 మంది వద్ద నుంచి రూ. 6 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేశారు.
నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, సెల్ఫోన్లు స్విచ్ఛాప్ చేయడంతో 18 మంది బాధితులు సుమారు రూ. 3.33 కోట్లు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అజ్ఞాతంలో ఉన్న నిర్వాహకుల్లో ఒకరైనా నికిల్‌కుమార్ గోయెల్‌ను బుధవారం అరెస్ట్ చేశారు.