Cab Drivers | శామీర్‌పేట, మార్చి 20 : ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్స్‌కు చెల్లిస్తున్న ధరను పెంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్ యాజమాన్యాల తీరుకు నిరసనగా తూంకుంట మున్సిపల్ దొంగల మైసమ్మ – శామీర్‌పేట ఓఆర్ఆర్ సర్కిల్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓలా, ఊబర్ డ్రైవర్లుగా పని చేస్తున్న మాకు యాజమాన్యాలు సరైన ధరలు చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. మేము ఉన్న స్థలం నుంచి దాదాపు 3 నుంచి 4 కిలో మీటర్ల దూరంలో కస్టమర్స్ ఇస్తున్నప్పటికి తమకు చెల్లించే ధరతో గిట్టుబాటు అవ్వడం లేదన్నారు. తూంకుంట నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు డ్రాప్(గిరాకి) పడితే ఓలా, ఊబర్ యాజమాన్యాలు క్యాబ్ డ్రైవర్లకు కేవలం 300 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తమకు ఇచ్చే కమీషన్ రేటు పెంచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇచ్చే ధర తమకు గిట్టుబాటు అవ్వడం లేదని గిరాకి డబ్బులు పెట్రోల్‌కే సరిపోతున్నాయన్నారు. పొద్దంతా కష్టపడితే కనీసం ఈఎంఐలు, ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థతి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓలా, ఊబర్ యాజమాన్యాలు క్యాబ్ డ్రైవర్లకు ఇస్తున్న కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్స్ వేణు గోపాల్, శ్రవణ్ కుమార్, శ్రవణ్, శ్రీనివాస్, మహేష్, మనోహర్, విష్ణు, సురేష్, మహేష్, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.