సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల విభాగం అధికారులు విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో(పటాన్చెరు నియోజకవర్గంలోని రెండు డివిజన్లకు) ఓటర్లు మొత్తం 1,09,56,477గా తేలింది. కాగా, జీహెచ్ఎంసీ పరిధితో పాటు రంగారెడ్డి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు మేడ్చల్ కలుపుకొంటే ఓటర్ల సంఖ్య 1,09,56,477గా తేలింది. అక్టోబర్ 4న విడుదల చేసిన తుది జాబితా తర్వాత ఎన్నికల విభాగం అధికారులు గత నెల 31 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తులకు అవకాశం కల్పించారు.
ఈ నేపథ్యంలోనే గడిచిన 10 రోజులుగా కొత్త ఓటర్లకు అవకాశంతో పాటు చనిపోయిన ఓటర్లు, నకిలీ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు. దాదాపుగా 55వేల మంది కొత్త ఓటర్ల ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
మహానగర పరిధిలోని కోటి తొమ్మిది లక్షలకు మందికి పైగా ఓటర్లు ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల విభాగం అధికారులు ఓటర్ స్లిప్లను పంపిణీ చేయనున్నారు.
తుది ఓటరు జాబితా ప్రకారంగా 24 నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 732587 ఓటర్లుగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ 6,99,042, మేడ్చల్ 6,37,838, ఎల్బీనగర్ 5,93,712, రాజేంద్రనగర్ 5,81,937 ఓటర్లతో టాప్ ఐదులో నిలిచాయి. ఇక అత్యల్పంగా చార్మినార్లో 2,26, 117 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. కాగా థర్డ్జెండర్లు 1170 మంది కాగా, ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు ఇతరుల జాబితాలో ఉన్నారు.