మేడ్చల్, మే8(నమస్తే తెలంగాణ): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. దిశ సమావేశంలో సమస్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తోపాటు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్లు పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోరారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మైనింగ్ వల్ల వచ్చే ఆదాయం అధిక మొత్తంలో మేడ్చల్ నియోజకవర్గానికి కేటాయించాలని కోరారు.

Mla Marri Rajasekhar Reddy
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని యూఎల్సీ భూములు సర్వే నెంబర్లు 582, 583, 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు. 15 ఫైనాన్స్ కింద మంజూరైన ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణ పెంచాలని కోరారు. రహదారులపై అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసే విధంగా నేషనల్ హైవే అథారిటి అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ శాఖల వారీగా సమీక్ష చేసి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని వేగవంతంగా కొనసాగించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వివరించారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.