Hyderabad City Police | సిటీబ్యూరో: ఓ జోన్ డీసీపీ తిట్ల పురాణం పోలీస్‌శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి.. నోటి దురుసుతో సిబ్బంది తీవ్ర మానసిక శోభకు గురవుతున్నారు. మరికొందరు ఆ జోన్లో పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. సదరు డీసీపీ వచ్చారంటే.. విరుచుకుపడటం.. తిట్టుడే ఉంటుందని.. మేం కూడా మనుషులమేనంటూ.. సిబ్బంది తమ బాధలను తోటివారికి చెప్పుకొని.. కుమిలిపోతున్నారు.
అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పౌరులకు పారదర్శకంగా సేవలు అందించాలన్న ధ్యేయంతో అధికారులు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇవ్వడం.. సున్నితంగా మందలించడం సాధారణమే. ఇందులో కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తప్పు చేశారన్న సమాచారం ఉన్నప్పుడు పై అధికారిగా సిబ్బందిని మందలించడం అప్పుడప్పడు జరుగుతుంది.
ఇలాంటి విషయాల్లో కిందిస్థాయి సిబ్బంది కూడా తప్పు చేశాం కాబట్టి.. మరోసారి ఆ తప్పు చేయవద్దనే తమ పై అధికారి మందలించారనే భావనలో ఉంటారు. అయితే సదరు జోన్ డీసీపీ పేరు ఎత్తితేనే ఆయన కింద పనిచేసే సిబ్బంది వణికిపోతున్నారు. పనిచేయించడంలో కఠినంగా ఉండటం మంచిదే..కానీ తమ కింద పనిచేసే వాళ్లు కదా అనే భావనతో ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఏమిటని సిబ్బంది వాపోతున్నారు.